
పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడి విద్యార్థులకు తెలుగు ఓనమాలు నేర్పించి, పాఠాలు బోధించారు. ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది అక్షరాలా నిజం. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని సర్కారీ బడుల్లో భారతీయ భాషా వేసవి శిబిరాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే పంజాబ్‌లోని ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు హాజరైన విద్యార్థులకు తెలుగు భాష ప్రాథమికాంశాలను నేర్పించారు.
నేర్పిన పాఠాలివే!
పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మే 26 నుంచి వారం రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరాలు జరిగాయి. వీటికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు హాజరయ్యారు. వీరికి తెలుగు వర్ణమాలను ఉపాధ్యాయులు నేర్పించారు. తెలుగు భాషలో వివిధ సంగీత పరికరాలు, పండ్లు, కూరగాయలు, వంటకాల పేర్లను పంజాబీ విద్యార్థులతో చదివించి, రాయించారు. తెలుగు భాషలోని నమస్కారం, ధన్యవాదాలు, అభినందనలు వంటి గౌరవపూర్వక పదాల గురించి తెలియజేసి..ప్రముఖ దేశభక్తి గేయాలను పాడించారు. వాటి అర్థాన్ని ఉపాధ్యాయులు వివరించారు. తెలుగు రాష్ట్రాలకు వెళితే ఆటో డ్రైవర్లు, బస్సు కండక్టర్లు, డ్రైవర్లు, వ్యాపారులను తెలుగులో ఎలా సంబోధించాలి అనేది నేర్పించారు.
విద్యార్థులకు మెటీరియల్- లెర్నింగ్ షీట్లు తయార్
పంజాబ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తెలుగు బోధన సాగింది. పంజాబీ విద్యార్థులకు బోధించాల్సిన తెలుగు బేసిక్స్ మెటీరియల్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ ప్రాజెక్టు పరిధిలోని తెలుగు నోడల్ అధికారి సమకూర్చారు. తెలుగు భాషా తరగతులను నిర్వహించే క్రమంలోనే విద్యార్థులకు డిజిటల్ (యూట్యూబ్) మెటీరియల్‌తో పాటు ప్రింటెడ్ మెటీరియల్‌ను కూడా పంపిణీ చేశారు. వాటిని చూస్తూ విద్యార్థులు తమతమ ఇళ్ల వద్ద ప్రాక్టీస్ చేసి, ప్రత్యేక లెర్నింగ్ షీట్లను రూపొందించారు.





