ArticlesNews

మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు తీసుకొచ్చిన భారత సైన్యం ‘యార్న్స్‌ ఆఫ్‌ యోర్‌’

12views

ఉపాధి కోసం గ్రామాలను విడిచి వెళ్లే వలసల్ని ఆపాలనుకున్నారు. ఇందుకు భారత సైన్యం ప్రారంభించిన ‘యార్న్స్‌ ఆఫ్‌ యోర్‌’ అక్కడి మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు తీసుకొచ్చింది. అదెలా అంటే…

త్తరాఖండ్‌లోని ఛమేలీ జిల్లా… ఆకాశాన్ని తాకే హిమాలయాలు. గడ్డ కట్టించే చలి. ప్రకృతి అందాలతో మనసుకు హాయిని కలిగిస్తుంది. కానీ, అక్కడి వాళ్లకు మాత్రం సరైన ఉపాధి లేక బతకడం కష్టమైంది. దాంతో అక్కడ వలసలు పెరిగాయి. అది ఎంతలా అంటే ఊళ్లో ఆడవాళ్లు, పిల్లలు మాత్రమే మిగిలారు. నైపుణ్యం ఉండి సరైన వనరులు అందక అక్కడ ఈ పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే 2024లో పీఎం ‘వైబ్రంట్‌ విలేజ్‌’ ప్రోగ్రామ్‌లో భాగంగా భారత సైన్యం ఆ గ్రామాల్లో యార్న్స్‌ ఆఫ్‌ యోర్‌ ప్రాజెక్టును మొదలుపెట్టింది. సూర్య కమాండ్‌ దీన్ని చూసుకుంటుంది. ఇది మొదలైన కొద్దిరోజుల్లోనే అక్కడి మహిళల జీవితాల్లో కొత్త కళ వచ్చింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తయారుచేసే ఉన్ని వస్త్రాలకు గిరాకీ ఎక్కువ. ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్‌ ప్రపంచంలో వాటిని పట్టించుకోవడమే మానేశారు. దాంతో వాటి డిమాండ్‌ తగ్గిపోయింది. వాళ్ల ఆదాయ వనరులు పడిపోయాయి. అందుకే సూర్య కమాండ్‌ సంప్రదాయ కళలకు ఆధునిక హంగులు, డిజైన్లు వంటివి నేర్పించడంలో శిక్షణ ఇస్తుంది.

అంతేకాదు, అవసరమైన వనరుల్ని అందిస్తుంది. తయారుచేసిన ఉత్పత్తుల్ని అమ్మేందుకు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌నీ ఏర్పాటుచేసింది. దాంతో ఇప్పుడు ఛమేలీ రోలి గ్వాడ్, ఘింగ్రాన్‌ ప్రాంతాల్లో మహిళలు తయారుచేసిన వివిధ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన ఇక్కడి ఆడవాళ్లు ప్రసుతం వ్యాపారులుగా, కళాకారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ ఆదాయం పెరిగింది. గ్రామాల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. దాంతో ఒకప్పుడు వలస వెళ్లిన వాళ్లు ఇళ్లకు తిరిగొస్తున్నారు. మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారనడానకి నిదర్శనంగా నిలిచి, గెలిచి చూపించారిక్కడి మహిళలు.