
భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాక్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే’ అనే ప్రచారాన్ని గణాంకాలు వాస్తవాలతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తిప్పికొట్టారు. ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టును రాసుకొచ్చారు. అసలు ఈ ప్రచారానికి ఎటువంటి ఆధారం లేదని కొట్టి పారేశారు.
‘‘ కాలం చెల్లిన సింధూ జలాల పంపిణీ ఒప్పందం నుంచి భారత్ బయటపడ్డాక.. ఇప్పుడు పాకిస్థాన్ మాకు కొత్త బూచిని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని భారత్‌కు రాకుండా ఆపేస్తే పరిస్థితి ఏమిటీ..? అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఈ ఊహాజనిత కట్టుకథను.. వాస్తవాలతో తిప్పికొడదాం.
బ్రహ్మపుత్ర నది భారత్‌లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందే కానీ.. కుంచించుకుపోదు. చైనా నుంచి కేవలం 30-35శాతం జలాలు మాత్రమే వస్తాయి. వీటిల్లో చాలావరకు మంచు కరిగి.. టిబెట్‌లోని పరిమిత వర్షాల వల్ల లభిస్తాయి. ఇక మిగిలిన 65-70శాతం నీరు భారత్ నుంచి వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయాలో రుతుపవనాల వల్ల కురిసే వర్షాలకు ధన్యవాదాలు చెప్పాలి. ఇక శుభాంశ్రీ, లోహిత్, కమెంగ్, మానస్, ధన్‌శ్రీ, జియా భరాలి, కోపిలి దీనికి ప్రధాన ఉపనదులు. ఇవికాక ఖాసీ గారో, జయంత హిల్స్ నుంచి కుల్సీ, కృష్ణాయ్, దిగారు నదుల నుంచి మిగిలిన జలాలు లభిస్తాయి. అది భారత్-చైనా సరిహద్దుల్లో సెకనుకు 2,000-3,000 క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుంది. అదే అస్సాంలో రుతుపవనాల సీజన్‌లో సెకన్‌కు 15,000-20,000 క్యూబిక్ మీటర్లగా ఉంటుంది.
బ్రహ్మపుత్ర జలాల కోసం భారత్ ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదు. అది వర్షాధారిత భారత నది. భారత్‌లోకి వచ్చాకే అది బలపడుతుంది. పాకిస్థాన్ తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే.. ఒకవేళ నీటి ప్రవాహాన్ని తగ్గించాలనుకుంటే (ఇప్పటివరకు చైనా ఆ దిశగా సంకేతాలు గానీ, బెదిరింపులు గానీ ఏ వేదిక పైనా చేయలేదు) అది భారత్‌కే ప్రయోజనకరం. ఎందుకంటే ఇక్కడ అస్సాంలో ఏటా వచ్చే వరదలు తగ్గి.. లక్షల మంది నిరాశ్రయులు కాకుండా ఉంటారు.
ఇక పాకిస్థాన్ కొన్ని దశాబ్దాలుగా సింధూజలాల ఒప్పందంలో లభించిన ప్రాధాన్యంతో దోచుకుంది. ఇప్పుడు భారత్ వాస్తవంగా తనకు రావాల్సిన హక్కు అడగడంతో బెంబేలెత్తిపోతోంది. వారు ఒకటి గుర్తుంచుకోవాలి. బ్రహ్మపుత్ర కేవలం ఒక్క దానితో నియంత్రించలేము. అది మా భౌగోళిక పరిస్థితులతో, మా రుతుపవనాలతో బలోపేతమైంది’’ అని పేర్కొన్నారు.
ఇటీవల సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జికాయ్ గావ్ తొలిసారి ఈ అంశాన్ని లేవనెత్తాడు. భారత్ సింధూజలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై స్పందిస్తూ.. బ్రహ్మపుత్ర నది నుంచి నీరు భారత్‌కు వెళ్లకుండా చైనా ఆపగలదని పేర్కొన్నాడు. ఈ అంశాన్ని పాక్ మీడియా విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది.





