News

రివ్యూ పిటిషన్ పై వెనక్కి తగ్గిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు

703views

రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీన రామ్ లల్లా విరాజమాన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం హిందూ సమాజానికే దక్కుతుందని, దీనికి ప్రత్యామ్నాయంగా ముస్లింలకు అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సారథ్యంలోని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు పట్ల సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మొదట అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాము పున: సమీక్ష కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేస్తామని వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది మొదట్లో ప్రకటించారు. ఆ తరువాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 26వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో ఏర్పాటయ్యే కేంద్ర కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకుంటామని వెల్లడించారు.

తాజాగా- లక్నోలో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సమావేశమైంది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జుఫర్ ఫారూఖీ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. వక్ఫ్ బోర్డు తీర్మానాలను ఆయన ప్రతిపాదించారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయకూడదని తాను భావిస్తున్నట్లు ఫారూఖీ తెలిపారు. దీనిపట్ల కొంతమంది బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయాల్సిందేనని, ఫలితంగా రామమందిరం నిర్మాణంలో మరికొంత జాప్యాన్ని సృష్టించినట్లు అవుతుందని వారు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయడం వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయని ఫారూఖీతో పాటు ఆయన మద్దతుదారులు వెల్లడించినట్లు సమాచారం. పైగా ముస్లిం పర్సనల్ లా బోర్డు సైతం రివ్యూ పిటీషన్ ను వేయడానికి ఆసక్తిగా లేదని ఫారూఖీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు తీర్పును స్వాగతించారని, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విరాళాలను సైతం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయడం వల్ల తాము ఒంటరిగా మిగిలిపోతామని, ముస్లిం పర్సనల్ లా బోర్డు సహా ఎవ్వరూ మద్దతు ఇవ్వడానికి ముందుకు రాకపోవచ్చని ఫారూఖీ మద్దతుదారులు వివరించినట్లు తెలుస్తోంది. దీనితో- రివ్యూకు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని వక్ఫ్ బోర్డులో మెజారిటీ సభ్యులు వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వక్ఫ్ బోర్డుకు అందే అయిదు ఎకరాలను తీసుకుని, అందులో మసీదును నిర్మించడమే మంచిదని మెజారిటీ సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది.
Source: One India

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.