
315views
తెలుగు గడ్డపై ప్రజారంజక పాలన అందించిన రెడ్డిరాజుల ఘన చరిత్ర, కొండవీడు గత వైభవం, చారిత్రక విశిష్టతను భావి తరాలకు అందించాలనే సత్సంకల్పంతో అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య – శ్రీశైలం వారు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు సమీపంలో ఉన్న ఫిరంగిపురం మండలం హౌస్‌గణేష్ గ్రామంలో రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల (మ్యూజియం) నిర్మించారు.

రెడ్డిరాజులు ఏలిన కొండవీడు, ఉదయగిరి, గద్వాల్ సంస్థానం, వనపర్తి, దూమకొండ, ఆత్మకూరు తదితర ప్రదేశాలకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు, సమాచారాన్ని నిపుణుల కమిటీ సభ్యులు సేకరించి ఇక్కడ ఆకర్షణీయమైన రీతిలో అందుబాటులో ఉంచారు. 36 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో నమూనా కొండవీడు కోట ప్రత్యేక ఆకర్షణ. ఆ కాలం నాటి తామ్ర, శిలా శాసనాల నమూనాలు, నాణేలు, శిల్పాలు, ఆయుధాలు తదితర వస్తువులు నాటి వైభవాన్ని కళ్లకు కడుతున్నాయి.





