ArticlesNews

నిష్కల్మష ప్రజాబంధు “ప్రకాశం”

402views

( మే 20 – టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి )

ఆంధ్ర ప్రజల ఆవేశానికి, అకుంఠిత ధైర్య సాహసాలకు, అసమాన త్యాగనిరతికి ప్రతినిధి ప్రకాశం పంతులు. అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదుర్కొనే విషయంలో ఆయనకు ఆయనే సాటి. ప్రజలను నమ్మి తన సర్వస్వాన్ని ధారపోసిన త్యాగమూర్తి ప్రకాశం. ప్రజలే ప్రకాశం..ప్రకాశమే ప్రజలని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆంధ్రకేసరిగా కీర్తి గడించిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు 1872 ఆగస్టు 23న నేటి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినోదరాయునిపాలెంలో జన్మించారు. తండ్రి పేరు గోపాలకృష్ణయ్య, తల్లి పేరు సుబ్బమ్మ. వీరిది మధ్యతరగతి కుటుంబం. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో బాల్యంలోనే ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు ఎదుర్కొన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఇంగ్లండ్ వెళ్లి బారిష్టర్ కోర్సు చదివారంటే అందుకు కారణం ఇమ్మనేని హనుమంతరావు నాయుడు గారు. ప్రకాశం పంతులుగారికి ఆయనే గురువు, మార్గదర్శి.

ప్రశాశం పంతులుగారు 1907లో బారిస్టర్ వృత్తిలో ప్రవేశించి 1921వరకు అంటే పద్నాలుగు సంవత్సరాల పాటు న్యాయవాద వృత్తిలో అంకితభావంతో సేవ చేశారు. అయితే బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలకు ఆకర్షితుడైన ఆయన లక్నో ఒడంబడిక తర్వాత కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచూ హాజరయ్యేవారు. ఈ క్రమంలోనే 1921 అక్టోబరులో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేయడం ద్వారా న్యాయవాద వృత్తిని వదిలి పూర్తిస్థాయిలో స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టారు. పత్రికా స్వేచ్ఛ పట్ల ప్రకాశం పంతులుగారు ఉదారవాద దృక్పథాన్ని కలిగి ఉండేవారు. 1910లో భారతదేశంలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన దేశవ్యాప్తంగా అక్షరాస్యత, విద్యా వ్యాప్తికి చురుకైన పాత్ర వహించారు. 1914లో ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి ప్రింటింగ్ ప్రెస్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. జర్నలిజంతో పాటు గ్రంథాలయ ఉద్యమాన్ని విద్య, ప్రజల రాజకీయ అవగాహన కోసం ఉపయోగించవచ్చని ఆయన గట్టిగా విశ్వసించారు.

ప్రమాదాలు ఉన్న చోటనే ప్రకాశంగారు ఉంటారని పట్టాభిగారు అన్న మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే, దేశంలో అల్లర్లు తలెత్తిన సందర్భంలో ప్రకాశం పంతులుగారు అక్కడకు వెళ్లి ప్రజలను ఓదార్చేందుకు ప్రయత్నించారు. అకాలీ సత్యాగ్రహం, ముల్తాన్‌లో హిందూ-ముస్లిం అల్లర్ల సమయంలోనూ ఆయన పంజాబ్‌ను సందర్శించారు. మోప్లా తిరుగుబాటు సమయంలో సందర్శకులపై నిషేధం ఉన్నప్పటికీ ఆయన కేరళలో పర్యటించారు. 1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ మద్రాసును సందర్శించినప్పుడు ప్రకాశం పంతులుగారు “సైమన్ గో బ్యాక్” నినాదాన్ని ఇచ్చి బ్రిటిష్ సైనిక తూటాలకు ఎదురొడ్డి నిలిచారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. స్వేచ్ఛాయుత, సార్వభౌమాధికార భారతదేశం కోసం టంగుటూరి ప్రకాశం పంతులుగారు అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారు. నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వారించినా కూడా 1948లో నిజాం అధికారంలో ఉండగానే ప్రకాశం పంతులు హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించారు. రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీని కలుసుకొని అనవసరమైన రిస్క్‌లు తీసుకోవద్దు, ప్రమాదంలో పడతావని హెచ్చరించిన ధీశాలి. తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వరని నెహ్రూని నిలదీసిన సమరశీలి. స్వరాజ్య పత్రికను నిలిపివేయాలనే గాంధీజీ సూచనను నిరాకరించిన సత్యశీలి. అందుకే కాబోలు, ఓ సందర్భంలో ప్రకాశం పంతులుగారిని ఉద్దేశిస్తూ, “అవసరమైతే గాలితో సైతం పోట్లాడే స్వభావం కలవారని”, అయ్యదేవర కాళేశ్వరరావుగారు అన్నారు. ఐక్య చర్య ద్వారా మాత్రమే స్వేచ్ఛను సాధించగలమని దృఢంగా విశ్వసించిన మన ఆంధ్రకేసరి, ఇందుకోసం గాంధీజీని సైతం వ్యతిరేకించడానికి వెనుకాడలేదు.

గ్రామీణాభివృద్ధికి ప్రకాశం పంతులుగారు ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చారు. స్వయం సమృద్ధి, స్వయంపాలన ఆధారంగా గ్రామాలు ఏర్పడాలని ఆయన విశ్వసించారు. హరిజనులు, చేనేత కార్మికులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పలు సంస్కరణలకు మార్గనిర్దేశం చేశారు. జమీందారి వ్యవస్థ రద్దుకు కృషి చేశారు. 1950ల ప్రారంభంలో ఆయన అందించిన ఫిర్కా అభివృద్ధి భావన సమాజాభివృద్ధి కార్యక్రమంలో అగ్రగామిగా నిలిచింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన ప్రజా సంక్షేమానికే అగ్రపీఠం వేశారు. ముఖ్యమంత్రిగా విదేశీ వస్త్ర కర్మాగారాలను రద్దు చేసి ఖాదీ మిల్లులను ప్రోత్సహించారు. 1953 అక్టోబరు 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు సేవలు అందించారు. ఆయన ఆ పదవిలో కేవలం 13 నెలలు మాత్రమే ఉన్నా రాష్ట్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఆ స్వల్పకాలంలోనే ఆయన రెండువేల మంది రాజకీయ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలుగువారికి ఓ హై కోర్టు స్థాపించారు. పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావాల్సిన మార్పులకు శాసనబద్దత కల్పించారు. విజయవాడ కృష్ణ బ్యారేజ్ నిర్మాణం కూడా ఆయన చలవే. సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు.

కుట్ర రాజకీయాలతో ప్రకాశం పంతులుగారు పదవిని పోగొట్టుకున్నా వెనకడుగు వేయలేదు. ప్రజలే తన తోడుగా, నీడగా వారితోనే ప్రకాశం పంతులుగారు మమేకమయ్యారు. 1955 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి ఆంధ్రరాష్ట్రమంతటా పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఒంగోలులో వడదెబ్బకు గురై హైదరాబాదులో చికిత్స పొందుతూ 1957 మే 20న దివంగతులయ్యారు. బారిస్టరుగా లక్షల రూపాయలు విలువైన ఆస్తులను సంపాదించినప్పటికీ దేశ స్వాతంత్ర్య సాధన కోసం వాటిని తృణప్రాయంగా వెచ్చించి ప్రకాశం నిరుపేదగా మిగిలిపోయారు. చరిత్రలో ఇటువంటి త్యాగధనులు అరుదుగా కనిపిస్తారు. తన జీవితాన్ని ధనాన్ని దేశ సేవకు ప్రజాసేవకు వెచ్చించి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజల మనిషిగా ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయన జీవితం త్యాగచరితం, విలువైన పాఠ్యగ్రంథం.