
పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా గాలింపులు చేపడుతోంది. ఇందులోభాగంగా దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశద్రోహులను గుర్తించడానికి నిఘా వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. పాక్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకోగా..తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్-STF పేర్కొంది.
యూపీలోని రాంపుర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ -ISI తరఫున సరిహద్దుల్లో అక్రమ రవాణా, గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఐఎస్‌ఐతో సంబంధాలు కొనసాగిస్తూ.. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. గూఢచర్యం సమాచారాన్ని పంచుకునేందుకు అతడు పలుమార్లు పాక్ వెళ్లొచ్చాడని.. పాక్‌కు సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలకు పాల్పడేవాడని అన్నారు.
షాజాద్ భారత్‌లో పలు సిమ్‌కార్డ్‌లను కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్‌ఐ ఏజెంట్లకు అందించేవాడని.. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పలువురు యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి.. ఐఎస్‌ఐలో చేరడానికి పాక్‌కు పంపించేవాడని అధికారులు తెలిపారు. అలా ఆ దేశానికి వెళ్లే వారికోసం ఉగ్రగవాదులు వారికి వీసాలు ఏర్పాటుచేసేవారని అన్నారు. ఇదే తరహాలో పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ చిక్కిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జ్యోతి పోలీసుల కస్టడీలో ఉంది.





