News

హనుమాన్ శోభాయాత్ర పై లాఠీఛార్జ్

399views

కన్నుల పండువగా హనుమాన్ శోభాయాత్ర. మదనపల్లె పట్టణానికి హనుమాన్ జయంతి కొత్త శోభ తెచ్చింది. వేలల్లో తరలివచ్చిన భక్తులతో పట్టణ వీధులు కిక్కిరిశాయి. దారి పొడవునా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో భక్తులు హోరెత్తించారు. ఇది చదువుతా ఉంటే ప్రతి హైందవ సోదరుడి మనస్సు ఉప్పొంగుతుంది కదా. కానీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన హనుమాన్ శోభాయాత్ర ఇందుకు భిన్నంగా సాగింది. ఆధ్యాత్మికశోభను వెల్లివిరియాల్సిన శోభాయాత్ర అరెస్టుల పర్వంతో అర్థాంతరంగా నిలిచింది.

పూర్తి వివరాల్లోకి వెళితే…హిందూ సంఘాల ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణంలో శనివారం హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో హిందూ ఐక్యవేదిక సంఘాల నేతలు, కార్యకర్తలతో పాటు యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక రామాలయం నుంచి జై శ్రీరామ్, వీర హనుమాన్ కీ జై అంటూ భక్తజం జయ జయ ధ్వానాలతో ప్రారంభమైన శోభాయాత్రను ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పోలీసులు నిలువరించారు. బైక్ ర్యాలీని సైతం అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఇదే సమయంలో శోభయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగేందుకు ప్రయత్నించిన హిందూ సంఘాల నేతలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న పలువురు స్థానిక నేతలను సైతం అరెస్టు చేశారు.

పోలీసుల తీరును రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు తప్పుబడుతున్నాయి. శాంతిభద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగిందో పోలీసులు సమాధానం ఇవ్వాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు అనుమతితోనే శోభాయాత్రను నిర్వహించుకుంటున్న తమపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా లాఠీఛార్జ్ చేయడం దారుణమని శోభాయాత్రలో పాల్గొన్న పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.