News

తుర్కియే వర్సిటీలతో రద్దవుతున్న ఒప్పందాలు

203views

పాకిస్థాన్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం మనదేశంపై దాడి చేయడానికి పాక్‌కు తుర్కియే డ్రోన్ల సరఫరాతో పాటు సైనిక సాయం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో వ్యాపారులు తుర్కియేతో వర్తక, వ్యాపారాలను నిలిపేస్తున్నారు. మన విశ్వవిద్యాలయాలు ఆ దేశ వర్సిటీలతో కుదుర్చుకున్న వివిధ రకాల ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి.

  • తాజాగా కాన్పుర్‌లోని ఛత్రపతి సాహు జీ మహారాజ్‌ విశ్వవిద్యాలయం నవంబరులో ఇస్తాంబుల్‌ యూనివర్సిటీతో చేసుకున్న అవగాహనా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించించారు. భారత్‌తో వైరం కొనసాగించే బంగ్లాదేశ్, తుర్కియే, పాకిస్థాన్‌ల్లోని విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు, ఒప్పందాలు, విద్యార్థుల బదిలీలు, పరిశోధన సంబంధాలు తక్షణమే బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్‌పీయూ), ఐఐటీ-రూర్కీ తుర్కియే, అజర్‌బైజాన్‌ల్లోని విశ్వవిద్యాలయాలతో అన్ని ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి.
  • ‘తుర్కియే బహిష్కరణ’ నినాదంతో స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జేఎమ్‌) దిల్లీలోని తుర్కియే విదేశాంగ కార్యాలయం సమీపంలో ఆ దేశానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టింది. మన జాతి ప్రయోజనాలకు, సైనికులకు సంఘీభావానికి గుర్తుగా సాంస్కృతిక ఎగుమతులు, తుర్కియే వస్తువులు, ఆ దేశానికి ప్రయాణాలు పూర్తిగా నిషేధించాలని ఆ సంస్థ జాతీయ సహ కన్వీనర్‌ అశ్వినీ మహాజన్‌ అన్నారు.
  • పర్యాటకం పైనా దెబ్బ!
    మరోవైపు, పాక్‌కు వత్తాసు పలికిన తుర్కియే, అజర్‌బైజాన్‌ దేశాల పర్యాటక రంగంపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్‌ నుంచి వెళ్లే పర్యాటకులు, వివాహ వేడుకల కోసం అక్కడికి వెళ్లే వారి సంఖ్య, భారతీయ సినిమా చిత్రీకరణలు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో మన ట్రావెల్‌ ఏజెన్సీలు కూడా తుర్కియేకు ఆన్‌లైన్‌ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.