News

పాక్‌కు ఉప్పందిస్తున్న హరియాణా విద్యార్థి అరెస్టు

290views

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ.. భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై హరియాణాలో ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పటియాలలోని ఖల్సా కళాశాలలో దేవేంద్ర సింగ్‌ ధిల్లాన్‌ పొలిటికల్‌ సైన్స్ చదువుతున్నాడు. మే 12న తన ఫేస్‌బుక్‌ ఖాతాలో గన్‌, పిస్టోల్‌ చిత్రాలను పోస్టు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది నవంబరులో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ద్వారా పాక్‌కు వెళ్లి అక్కడి ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులతో భారత్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అంగీకరించాడు. అందుకు పాక్‌ అధికారులు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు తెలిపాడు. పటియాలా మిలిటరీ కంటోన్మెంట్‌కు సంబంధించిన చిత్రాలను సైతం అతడు పాక్‌ అధికారులకు అందించాడు. దేవేంద్రసింగ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ దర్యాప్తునకు పంపించాం. డబ్బు లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నాం. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.

ఇక, ఇటీవల పాకిస్థాన్‌ ఐఎస్‌ఐకు గూఢచర్యం చేస్తున్న ఒక వ్యక్తిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేస్తున్న రవీంద్రకుమార్‌ ఓ అమ్మాయి వలపు వలలో చిక్కి.. భారత సైన్యం ఆయుధాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌ అధికారులకు చేరవేశాడు. దీంతోపాటు గగన్‌యాన్‌ ప్రాజెక్టు వివరాలను అందించినట్లు విచారణలో తేలింది. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న ఐఎస్‌ఐ సభ్యులతోనూ అతడు నేరుగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.