ArticlesNews

పుష్కర సరస్వతి

421views

జీవుల మనుగడకు జలమే ఆధారం. జల ప్రవాహాల వెంటే నాగరికతలు విలసిల్లాయి. అలాంటి జల నిధుల్ని దేవతా స్వరూపాలుగా ఆరాధించడం మన సంస్కృతీ సంప్రదాయాల్లో ముఖ్యాంశం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు మన దేశంలోని పన్నెండు ముఖ్య నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి వివిధ రాశుల్లో ప్రవేశించడంతో నదులు పుష్కర కళను సంతరించుకుంటాయి. ఆ క్రమంలో బృహస్పతి, మిథున రాశిలోకి సంక్రమణం చేసిన సందర్భంగా మే 15 నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కర తేజస్సుతో వర్ధిల్లుతుంది.

‘సరస్వతి’ అనే శబ్దానికి సర్వత్రా వ్యాపించిన దివ్యశక్తి అని అర్థం. ‘సర:’ అంటే జ్ఞాన ప్రసరణం. నిత్య చైతన్యరూపిణిగా, జీవులలో వెల్లివిరిసే ప్రాణశక్తికి సంకేతంగా సరస్వతి భాసిల్లుతోంది. అలాంటి విజ్ఞాన వరదాయిని నదీమతల్లిగా అవతరించింది. వివిధ పురాణాల్లో సరస్వతీ నది ప్రసక్తి ఉంది. వేద సాహిత్యంలో గంగానది కన్నా ఎక్కువగా దీని ప్రస్తావన కనిపిస్తుంది. సరస్వతిని నదులలో సర్వ శ్రేష్ఠమైనదిగా రుగ్వేదం అభివర్ణించింది. దేవలోకంలో దీనికి క్షీరవాహిని అని పేరు. ఈ నదిని మోక్షమార్గంగా పురాణాలు పేర్కొన్నాయి.

హిమాలయాల్లోని శివాలిక్‌ పర్వత శ్రేణుల్లో ఉన్న ఉత్తరాఖండ్‌లోని బదరీనాథ్‌ సమీపంలోని ‘మనా’ సరస్వతి ఆరంభ స్థానం. అక్కడి నుంచి అది అలకనందలో సమ్మిళితమై, పశ్చిమాన సింధూ నది, తూర్పున గంగా నదుల మధ్య ప్రవహించేది. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల గుండా ప్రవహించి ప్రభాసతీర్థం దగ్గర అరేబియా సముద్రంలో సంగమించేది. ఒకప్పుడు సరస్వతీ నది మిగతా నదుల మాదిరిగానే జీవనది. వేల సంవత్సరాల కిందటి భౌగోళిక మార్పుల కారణంగా అది అదృశ్యమై ప్రస్తుతం ప్రయాగలో గంగా యమునలతో పాటు అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. అందుకే ఈ పవిత్ర సన్నిధిని త్రివేణి సంగమంగా వ్యవహరిస్తారు. సరస్వతీ నది ఆవిర్భావానికి సంబంధించి అనేక గాథల్ని పురాణాలు పేర్కొన్నాయి. భూలోకంలో మానవులను ఉద్ధరించడానికి, విష్ణువు అభీష్టం మేరకు సరస్వతీ దేవి, జలరూపిణిగా దివి నుంచి దిగివచ్చిందని పద్మపురాణం పేర్కొంది.

సరస్వతీ తీరం జపతపాలకు ప్రసిద్ధి. వేదవ్యాసుడు సరస్వతీదేవిని ఉపాసించి, ఆ నది తీరంలోనే మహాభారత రచన చేశాడని ప్రతీతి. హరప్పా నాగరికత సరస్వతి నదీ తీరాన రూపుదిద్దుకుందని చరిత్రకారులు నిర్ధారించారు. యజుర్వేదం ప్రకారం సరస్వతికి సుప్రభ, కాంచన, ప్రాచీ, నంద, విశాలక అనే అయిదు ఉపనదులున్నాయి. బద్రీనాథ్‌ దగ్గర ప్రవహించే అలకనంద నదితో సరస్వతి మిళితమవుతుంది. కాబట్టి ప్రధానంగా బదరీలోనూ, ప్రయాగలోని త్రివేణి సంగమ క్షేత్రంలోనూ సరస్వతీనది పుష్కరోత్సవాలు జరుగుతాయి. తెలంగాణలోని కాళేశ్వర క్షేత్రంలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తోందని స్థలపురాణం చెబుతోంది. ఈ తీర్థక్షేత్రంలో భక్తులు పుణ్యస్నానాలను, పుష్కరవిధుల్ని ఆచరిస్తారు. దేవలోక దివ్యనదిగా వాసికెక్కిన సరస్వతి, వైభవోపేత వేద స్వరూపిణి.. నిరుపమాన విజ్ఞాన తరంగిణి!