News

అందరికీ సంస్కృతం చేరవేయడమే అకాడమీ లక్ష్యం

5views

పండితులు మాత్రమే సంస్కృతాన్ని అధ్యయనం చేయగలరనే అపోహను తొలగించి, ప్రతి ఒక్కరికీ సంస్కృత భాషను చేరువ చేయడమే తెలుగు–సంస్కృత అకాడమీ ప్రధాన లక్ష్యమని అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) పేర్కొన్నారు.

వడ్డేశ్వరంలోని తెలుగు–సంస్కృత అకాడమీలో నిర్వహించిన సంస్కృత మేధావుల సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశం కులాలు, మతాల పేరుతో విభజనలను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమాజాన్ని ఏకతాటిపై నిలబెట్టగల శక్తి సంస్కృత భాషకు ఉందని అన్నారు.

“అమృతం మధురం, సంస్కృతం అంతకంటే మధురం” అనే సంస్కృత సూక్తిని ప్రస్తావిస్తూ, సంస్కృతం భారతీయ జ్ఞాన సంపదకు మూలాధారమని పేర్కొన్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం ఈ విశ్వమే సంస్కృత భాషతో సమన్వితమై ఉందని చెప్పారు. ప్రాచీన భారతదేశంలో సంస్కృతం కేవలం ఒక భాష మాత్రమే కాకుండా విజ్ఞానానికి, తత్వచింతనకు, సంస్కృతికి ఆధారంగా నిలిచిందని వివరించారు. అయితే ఆధునిక కాలంలో సంస్కృతం కేవలం ధార్మిక కార్యక్రమాలకే పరిమితమైన భాషగా ప్రజల్లో భావన ఏర్పడటం విచారకరమని అన్నారు.

సదస్సులో పాల్గొన్న సంస్కృత పండితులు భాషాభివృద్ధికి పలు సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ‘సంస్కృత సప్తాహం’ నిర్వహించాలని, విద్యార్థుల్లో సంస్కృతంపై ఆసక్తి పెంపొందించేందుకు నీతి కథలు, జాతీయ భావనలు, భారతీయ సంస్కృతి అంశాలతో కూడిన చిన్న పుస్తకాలను ప్రచురించాలని సూచించారు.

ఆచార్య దీక్షితులు మాట్లాడుతూ సంస్కృతం, తెలుగు భాషలు తల్లి–బిడ్డల సంబంధంలాంటివని అన్నారు. సంస్కృత అకాడమీ యూట్యూబ్ ఛానల్‌ను సమర్థవంతంగా వినియోగించి భాష ప్రచారాన్ని విస్తరించాలని సూచించారు.

ఆచార్య దొర్బల ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యంత ప్రాచీన భాషలలో సంస్కృతానికి విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. ఆచార్య రమణ శాస్త్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఆన్-డ్యూటీ సౌకర్యం కల్పిస్తే సంస్కృత ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ సమావేశంలో ఆచార్య పి.టి.జి.వి. రంగాచార్యులు, డాక్టర్ పాలపర్తి శ్యామలానందరావు, డాక్టర్ దివి నరసింహ దీక్షితులు, డాక్టర్ వందనరావు, డాక్టర్ రమణమూర్తి, ఆచార్య మారుదూరి నరసింహాచార్యులు, శ్రీమతి పిన్నమనేని భవాని, తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయ ఆచార్యులు నందన్‌రావు, డాక్టర్ కనపాల కుమార్, వి.జి. చంద్రన్, అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరి, డాక్టర్ ఎస్.వి.టి. రాజ్యలక్ష్మి, డాక్టర్ గ్లోరీ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.