
అయోధ్యలో విరాళాల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో దర్యాప్తు తాజా పురోగతిపై స్థాయీ నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. సిట్‌లో ఏయే అధికారులు ఉన్నారో అందులో తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. కేంద్రప్రభుత్వానికి, యూపీ సర్కారుకు, శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టుకు నోటీసులు జారీచేసింది. విరాళాల చోరీ విషయంలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. సిట్ నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని కేంద్ర, యూపీ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ట్రస్టుకు ఈ సమయంలో నోటీసులివ్వకుండా వాయిదావేయాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. విరాళాల చోరీపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, రామజన్మభూమి ట్రస్టు నిధులపై కాగ్‌తో ఆడిట్ జరిపించాలని నరేంద్రకుమార్ గోస్వామి అనే న్యాయవాది, సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరపాలని మరికొంత మంది పిటిషన్లు దాఖలు చేశారు.





