
బాంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ నోబెల్ బహుమతి గ్రహీత అని తెలిసిందే. బాంగ్లాదేశ్లో చిన్న మొత్తాలతో ఆర్థిక వ్యవస్థనే మార్చేశాడని ఆనాడు ఈయనకి నోబెల్ కమిటీ ఈ పురస్కారం ఇచ్చింది. ఇప్పుడు ఆయన చేస్తున్న నిర్వాకాలు నోబెల్ గ్రహీత స్థాయికి తగ్గట్టు లేవు కాబట్టి ఆ పురస్కారం వెనక్కి తీసుకోవాలని ప్రఖ్యాత బాంగ్లాదేశ్ రచయిత్రి, ప్రవాసంలోనే గడుపుతున్న తస్లీమా నస్రీన్ మే 1వ తేదీన నోబెల్ కమిటీకి ఒక లేఖ రాశారు.” అసలు ఆయన గత కొన్నేళ్లుగా పన్నులే ఎగ్గొడుతున్నాడనీ, శాంతిని ఇభగ్నం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను కుంటుపరిచారని తస్లీమా ” ఆరోపించారు. బాంగ్లా విమోచన యోధుల కుటుంబాలకు కోటా అన్న అంశం మీద వివాదం చెలరేగి నిరుడు పెద్ద ఎత్తున అల్లర్లు రేగడం, దానితో షేక్ హసీనా భారతదేశానికి రావడం తెలిసిందే.
తరువాత యూనస్ బాంగ్లాదేశ్ను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టి వేశారని, రాజకీయ, ఆర్థిక, సామాజిక అలజడులతో అతలాకుతలం అవుతున్నదని తస్లీమా నోబెల్ కమిటీకి తెలియచేశారు. ఆయన గుండె నిండా పగ ప్రతీకారాలేనని అన్నారు. ఆయన వ్యవహార సరళి ఆటవికమని, అనాగరికమని ధ్వజమెత్తారు. విపక్షాలకు చెందిన వారిని ఆయన హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. శాంతిని నెలకొల్పాలన్న యోచన ఆయనకు ఏమాత్రం లేదని కూడా తస్లీమా తేల్చి చెప్పారు. ఈ తొమ్మిది మాసాలలో బాంగ్లాదేశ్ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేదని ఆమె కమిటీకి తెలియచేశారు. అలాంటి వ్యక్తికి మీరు నోబెల్ వంటి పెద్ద పురస్కారం ఇచ్చారు కాబట్టి, ఇకనైనా దానిని వెనక్కి తీసుకుని, దాని పవిత్రతను కాపాడాలని తస్లీమా విజ్ఞప్తి చేశారు.





