
భారత్ క్షిపణి దాడిలో తన కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ ధ్రువీకరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా బహావల్‌పుర్‌లో గల జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని క్షిపణి దాడితో ధ్వంసం చేసింది.
ఈ క్రమంలో మసూద్ సోదరి-ఆమె భర్త, మేనల్లుడు-అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మరణించారని ఓ ప్రకటనలో మసూద్ వెల్లడించారు. అలాగే మసూద్‌కు అత్యంత సన్నిహితుడు, అతని తల్లి, మరో ఇద్దరు సన్నిహితులూ క్షిపణి దాడిలో మృతి చెందారని ఆ ప్రకటనలో వివరించారు.
కరుడుగట్టిన ఉగ్రనేత
మసూద్ అజార్‌ను 2019, మేలో ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఏప్రిల్ 2019 నుంచి అజార్ బయట ప్రపంచానికి కనిపించకుండా బహవల్‌పుర్‌లోని ఓ రహస్య స్థావరంలో దాక్కున్నాడని భావిస్తున్నారు. భారత పార్లమెంటుపై ఉగ్రదాడి (2001), జమ్మూకశ్మీర్ శాసనసభపై దాడి (2000), పఠాన్‌కోట్‌లో ఐఏఎఫ్ స్థావరంపై దాడి (2016), పుల్వామాలో ఆత్మాహుతి దాడి (2019) వంటి ఘటనల్లో జైషే మహ్మద్ ముఖ్యపాత్ర పోషించింది. 1999లో ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో ప్రయాణికులను సురక్షితంగా విడిచిపెట్టేందుకు ఉగ్రవాది మసూద్ అజార్‌ను భారత్ జైలు నుంచి విడుదల చేసింది. అప్పటి నుంచి బహావల్‌పుర్ జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. బహావల్‌పుర్‌లోని మర్కజ్ సుబాన్‌ను మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.





