
( వైశాఖ శుక్ల షష్ఠి – శ్రీ రామానుజాచార్యుల జయంతి )
ఆధ్యాత్మిక ఆకాశoలో వెలిగే సూర్యులలో ముఖ్యులు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు; ఆదిశంకరులు అద్వైత భాస్కరులైతే, మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతకర్త, రామానుజాచార్యులు విశిష్టాద్వైత వేదాంత తత్త్వవేత్త. శ్రీ రామానుజాచార్యులు సుమారు వేయి సంవత్సరాల క్రితం శ్రీ పేరుంబుదూర్ లో 11వ శతాబ్దం, 1017సంవత్సరంలో కేశవ సోమయాజి, కాంతిమతుల పుత్రుడిగా జన్మించారు. ఆయన జయంతిని ఈ సంవత్సరం మే 3వతేదీన జరుపుకుంటున్నాము. ఆయన గురువు శ్రీ యాదవ ప్రకాశుల వద్ద శిష్యుడిగా చేరి వేదాలు, ఉపనిషత్తులు,శాస్త్రాలు అభ్యసిoచారు. కొన్ని అర్ధ తాత్పర్యాలలో గురు శిష్యులకు భేదాభిప్రాయాలు రావడంతో శ్రీ రామానుజాచార్యులు తనంతట తానే అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఆయన ‘ఆళ్వారుల’ సంప్రదాయం ప్రకారం నాధముని, యమునాచార్యుల బాటను అనుసరించారు. వారు యాదవ ప్రకాశుల వద్దనుండి వెళ్ళిపోయిన తరువాత గురువు మహాపూర్ణులకు శిష్యులై సన్యాసం స్వీకరించారు. కాంచీపురం వరదరాజస్వామి దేవాలయంలో పూజారిగా ఉంటూ పరబ్రహ్మ తత్వం గురించి బోధిస్తూ ముక్తిమార్గం ప్రవచించేవారు.
రామానుజాచార్యులు భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలను రచించారు. వారి గ్రంథాలలో అతి ప్రాచుర్యమైనవి `వేదాంత సంగ్రహం’ – వేదాలపై భాష్యం, భగవద్గీతా భాష్యం, బ్రహ్మసూత్రాలపై `శ్రీ భాష్యం’, `వేదాంతసారం’, `వేదాంత దీపిక’, `గద్య త్రయం’ అనబడే శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం మరియు శ్రీ వైకుoఠ గద్యం. శంకరులు ఆత్మకు పరబ్రహ్మ తత్వానికి భేదoలేదని, ఆ తత్వo జీవకోటిలో భాసించడమే అద్వైతమని తెలిపారు. అయితే శ్రీ రామానుజాచార్యులు, `ద్వైతం’ తో జీవాత్మ పరమాత్మ వేరు అని కొంత ఏకీభవిస్తూనే, జీవాత్మలలో ఉన్న విశ్వజనీనత కారణంగా, భక్తితో భగవంతుడిని సేవిస్తే, ప్రతి ఆత్మ పరమాత్మ అవగలదని `విశిష్టాద్వైత’ తత్వాన్ని విశదీకరిoచారు.
విష్ణుభక్తులందరూ వైష్ణవులేనని శ్రీ రామానుజులవారు ఉద్భోధించారు. ఆసేతు హిమాచలం పర్యటించి, విశిష్టాద్వైత సిద్ధాంతాలతో పాటు కులభేదాలులేని వైష్ణవ వ్యాప్తికి కృషిచేసారు. శ్రీరంగనాథుని దేవాలయo పూజావిధానాలు సంస్కరించి కొన్ని ముఖ్య పద్ధతులు ప్రవేశపెట్టి, అన్ని కులాలవారికి దేవాలయ ప్రవేశం కల్పించారు. శ్రీరంగం, తిరుపతి, కాంచీపురం మరియు ఇతర వైష్ణవాలయాలలో వారు ప్రవేశపెట్టిన ఆచారాలు, పూజావిధానాలే నేటికీ కొనసాగుతున్నాయి. వారి శిష్యులైన శ్రీ కూరత్తాళ్వార్, శ్రీ అనంతాళ్వార్ మొదలగువారు విశిష్టాద్వైతాన్ని భారతదేశమంతా వ్యాప్తి చేసారు.
‘అంత్యజుల నుంచి బ్రాహ్మణుల వరకు అందరికి భక్తి మార్గం సమానమేనని ప్రబోధించిన ఆధ్యాత్మిక సారథి భగవద్రామానుజులు’ అని స్వామి వివేకానంద, ‘ధార్మికంగా, సామాజికంగా విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టిన మహాస్రష్ట. ధైర్యంతో కూడిన ప్రేమ, వెన్నుచూపని నైతిక యుద్ధ కౌశల్యం, ఎంచరానంత బలమైన ఆత్మబలం, భావితరాలపై ప్రేమ లాంటి విశేష గుణాలు ఆయన సొంతం’ అని సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు, ‘ఒక వర్గానికి పరిమితమైన మోక్షద్వారాలను సర్వులకూ తెరిచిన సమతామూర్తి రామానుజులు’ అని తమిళ ప్రసిద్ధ కవి భారతీదాసన్ శ్లాఘించారు.
సమాజ హితం కోరే క్రమంలో తనకు కీడు కలిగినా ఫర్వాలేదని జనులు తరిస్తారని తీర్మానించుకొని శ్రీసౌమ్యనారాయణ పెరుమాళ్ కోవెల పైభాగం నుంచి తిరుమంత్రార్థాన్ని ఉద్ఘోషించిన మహనీయులు శ్రీరామానుజాచార్యులవారు. ‘కేవలం జ్ఞానార్జనతోనే సరిపోదు. ధర్మాను ష్ఠానంతోనే జ్ఞానం సార్థకమవుతుంది. సామాజిక బాధ్యతలు గుర్తెరిగి న్యాయదృష్టితో కర్మాచరణ చేయడంతోనే జీవితం సార్థకమవుతుంది’అని ఉద్బోధించిన రామానుజులు, తాము ప్రారంభించిన ‘జ్ఞాన ఉద్యమం’ కొనసాగింపు బాధ్యతను 74 మంది శిష్యులకు అప్పగించారు.శిష్యప్రశిష్య పరంపరంతో భగవద్రామానుజ ఆశయం కొనసాగుతూనే ఉంది, ఉంటుంది. సామాజిక చైతన్యం అనే మహాకార్యం నిర్వహిస్తూ 120 సంవత్సరాల వయసులో శ్రీ రామానుజాచార్యులు పరమాత్మలో లీనమయ్యారు. సమాజంలో అసమానతలు తొలిగించి సమ సమాజ స్థాపనకు కృషి చేసిన రామానుజాచార్యుల వారిని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రం ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 216 అడుగుల రామానుచార్యుల వారి భారీ పంచలోహ విగ్రహాన్ని ప్రధాని, రాష్ట్రపతి చేతుల మీదుగా 2022లో ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.




