( ఏప్రిల్ 28 – కాళ్లకూరి నారాయణ రావు జయంతి )
‘కావ్యేషు నాటకం రమ్యం’ అని పండిత వాక్కు. సాహిత్య ప్రక్రియల్లో నాటకం అత్యంత శక్తిమంతమైన సాధనం. ప్రజల హృదయాలను సూటిగా స్పందింపజేసే శక్తి ఒక్క నాటకానికే ఉంది. నాటకాన్ని సాహిత్య ప్రక్రియగా, ప్రదర్శన కళగా ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తున్నారు. సమకాలీన సామాజిక వ్యవస్థను, విభిన్న మానవ ప్రవృత్తుల్ని ప్రకటిస్తుంది సాంఘిక నాటకం. సంఘంలోని సమస్యల్ని ప్రతిబింబిస్తూ, అవగాహనను, చైతన్యాన్ని కల్పిస్తుంది. తెలుగులో సంఘ సంస్కరణ దృక్పథంతో నాటకాలను రచించిన సాహితీవేత్త కాళ్లకూరి నారాయణ రావు.
సాహితీవేత్త కాళ్లకూరి నారాయణరావు కవి, నాటక కర్త, పత్రికా సంపాదకులు, ఛాయాగ్రాహకుడు, న్యాయవాది. 1871 ఏప్రిల్ 28న పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం, మత్స్యపురి గ్రామంలో అన్నపూర్ణమ్మ, బంగారు రాజు దంపతులకు జన్మించారు. కాకినాడలో పాడి వెంకట నారాయణ వద్ద కావ్య, నాటక, అలంకార గ్రంథాలు అధ్యయనం చేశారు. కొంతకాలం ఫొటోగ్రాఫర్ వృత్తి చేపట్టిన నారాయణరావు హరికథలు చెప్పేవారు. కొద్దికాలం ఒక కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. న్యాయవాద వృత్తి సాగించినా అది నామమాత్రమే.
నారాయణరావుపై కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడుల ప్రభావం ఎక్కువ. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదర కవుల స్పర్ధల్లో కొప్పరపు కవులను సమర్థించారు. కాళ్లకూరి పేరు చెప్పగానే మూడు నాటకాలు గుర్తుకొస్తాయి. చింతామణి (1921), వరవిక్రయం (1923), మధుసేవ (1926). సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి నాటక రచనను సాధనంగా చేసుకొని వీటిని రాశారు. వేశ్యా లంపటత్వాన్ని నిరసించడానికి చింతామణి, వరకట్న దురాచారాన్ని దుమ్మెత్తిపొయ్యడానికి వరవిక్రయం, మద్యపానం విషతుల్యమని చెప్పడానికి మధుసేవలను రచించారు. చింతామణి, వరవిక్రయం- అనంతర కాలంలో చలన చిత్రాలుగా ప్రేక్షకుల్ని అలరించాయి.

గంభీరమైన వరకట్న సమస్యను హాస్యాన్ని మేళవించి వరవిక్రయం నాటకంగా రూపొందించారు. ఇది కూడా పద్య నాటకమే. దేశ భక్తుడు, నిజాయతీ పరుడు పురుషోత్తమ రావు, ఆయన భార్య భ్రమరాంబ, కుమార్తెలు కాళింది, కమల, డబ్బే సర్వస్వంగా జీవిస్తూ, ఏ మాత్రం నీతి నియమాల్లేని సింగరాజు లింగరాజు, అతడి పెంపుడు కొడుకు బసవరాజు, పెళ్ళిళ్ల పేరయ్య, వివాహాల వీరయ్య ప్రధాన పాత్రలుగా చక్కటి వ్యవహార భాషలో నాటకం సాగుతుంది. ఉత్కంఠ కలిగించే ‘కోర్టు సీను’, చివరికి దుష్ట పాత్రలో పరివర్తనంతో కథ సుఖాంతం అవుతుంది. మూడు నాటకాల్లోనూ చక్కని సంభాషణా రచన, విశిష్టమైన పద్య రచనా శిల్పం గోచరిస్తాయి.