
పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం స్పందించింది. అమర్‌నాథ్ యాత్ర సజావుగా సాగేలా చర్యలు చేపడతామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. జులై 3వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై విధంగా స్పందించారు. పహల్గాంలో దాడి జరిగినప్పటికీ.. కాశ్మీర్‌లో పర్యాటకం తిరిగి త్వరలో ప్రారంభమవుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాశ్మీర్ అభివృద్ధిని ఎవరు అడ్డుకొలేరని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థానీ జాతీయులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని.. వారు భారత్ విడిచి వెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. దేశం ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించదన్నారు. పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటంపై భారతదేశానికి ఆసక్తి లేదని తెలిపారు. పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ముద్ర వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఏప్రిల్ 15 నుంచి…
ఈ ఏడాది అమర్‌నాధ్ యాత్రకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. జులై 3వ తేదీన ఈ అమర్‌నాథ్ యాత్ర రెండు మార్గాల నుండి ఒకే సారి ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ నుంచి.. అలాగే గందేర్‌బాల్ జిల్లాలోని బాల్తాల్ నుంచి ఈ యాత్ర ప్రారంభకానుంది. ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీతో ముగియనుంది.





