News

ముస్లిం స్వయంప్రకటిత మేధావులు రెచ్చగొడుతున్నారు : VHP మండిపాటు

234views

ముస్లిం వర్గ మేధావులపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా విరుచుకుపడింది. దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచీ ముస్లిం సమాజంలోని కొంత మంది మేధావులు, నాయకులు తప్పుడు వ్యాఖ్యలతో ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. వక్ఫ్ చట్టం పేరుతో అశాంతిని రేకెత్తించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విరుచుకుపడింది.

ఈ విషయంపై విశ్వహిందూ పరిషత్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ విజయ్ శంకర్ తివారీ స్పందించారు. ఇటీవలే కొందరు స్వయం ప్రకటిత ముస్లిం మేధావుల బృందం ముస్లిం పార్లమెంట్ సభ్యులకు కూడా లేఖలు రాశారని, వక్ఫ్ చట్టంపై రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆక్షేపించారు.

ముస్లిం ఎంపీల బృందాలు ముస్లిం స్వయం ప్రకటిత మేధావులు రాసిన లేఖను విజయ్ శంకర్ తివారీ ఖండించారు. భారత పార్లమెంటరీ వ్యవస్థను, రాజ్యాంగ చట్రాన్ని అవమానించడమే అవుతుందన్నారు. అలాగే వక్ఫ్ చట్టంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, దీంతో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. వేర్పాటు వాదాన్ని ప్రేరేపించే విధంగా ఈ లేఖలో ఉద్దేశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

ముస్లింల హక్కుల కోసం తాము వాదిస్తున్నామని వారు లేఖలో పేర్కొంటున్నారని, ముస్లిం సమాజాన్ని గొంతు కోసి చంపేస్తున్నారంటూ, ఉనికి కోసం పోరాడాలంటూ చాలా ఉద్రిక్తమైన భాషను అందులో ప్రయోగించారని ఆయన ఆక్షేపించారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించే లక్ష్యంతోనే పార్లమెంటు లోపల, బయట నిరసనలు తెలియజేస్తున్నారని, పార్లమెంట్ కార్యకలాపాలను కూడా బహిష్కరించడం లాంటివి చేస్తున్నారని మండిపడ్డారు.

ఇలాంటి లేఖల ద్వారా సమాజంలో ఇబ్బందులు వస్తాయని తివారీ అన్నారు. మాజీ శాసన సభ్యులు, అధికారులు, మాజీ సైనిక సిబ్బంది, మైనారిటీ అధికారులు, మాజీ వీసీలు, వక్ఫ్ బోర్డు సబ్యులు, సీనియర్ న్యాయవాదులు, జర్నలిస్టులు.. ఇలా సమాజంలోని విభిన్న రంగాల ప్రముఖుల ప్రమేయం కూడా ఇందులో వుందని, దీని ద్వారా సమస్య మరింత జటిలం అవుతుందని అన్నారు.

గతంలో చాలా నిరసనలు వ్యక్తమయ్యాయని, అవి కొన్ని సార్లు హింసకు కూడా దారి తీశాయని, అయినా లేఖలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని తివారీ మండిపడ్డారు. ఆందోళనలు, నిరసనలు చేసేలా ప్రేరేపిస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని తివారీ హెచ్చరించారు. దీని ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా.. ముస్లిం స్వయం ప్రకటిత మేధావులే బాధ్యత వహించాలని తివారీ హెచ్చరించారు.