
వక్ఫ్ చట్టంపై జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో నానా హంగామా చోటు చేసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్యేలు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హంగామా చేశారు. ఈ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు చట్టానికి సంబంధించిన ప్రతులను చింపేసి, నినాదాలు చేశారు. అలాగే నల్లటి బ్యాండ్లు ధరించి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అంతేకాకుండా ఓ ఎమ్మెల్యే తాను వేసుకొనే కోటును కూడా చింపేసి, అసెంబ్లీలో హంగామా చేశారు.
వక్ఫ్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. తాము ఎమ్మెల్యేలము అని కూడా మరిచిపోయిన విధంగా ప్రవర్తన వుందని విమర్శలు వస్తున్నాయి. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.వక్ఫ్ చట్టంపై చర్చను చేపట్టాలని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేసింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని స్పీకర్ అబ్దుల్ రహీం అన్నారు. దీంతో గందరగోళం నెలకొంది.
మరోవైపు దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. నేషనల్ కాన్ఫరెన్స్ వక్ఫ్ చట్టం విషయంలో మతపరమైన భావాలను రెచ్చగొడుతోందని ప్రతిపక్ష నేత సునీల్ శర్మ మండిపడ్డారు.వక్ఫ్ బిల్లు ఇప్పటికే పార్లమెంటులో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు విచారణలో వుందని, అలాంటప్పుడు అసెంబ్లీలో బిల్లుపై చర్చించడం అనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ అంశంపై ముగ్గురు నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీలు మౌనంగా వుండిపోయారని, ఇప్పుడు మాత్రం అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతోందని విమర్శించారు. ఇది కచ్చితంగా మతపరమైన భావాలను రెచ్చగొట్టడమేనన అన్నారు.





