News

ఇక నుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడాఖ్

940views

మ్మూకాశ్మీర్‌లో గురువారం నుంచి నూతన శకానికి నాంది పలకనుంది. జమ్మూ, లడఖ్ ఇకపై కేంద్ర పాలిత ప్రాంతాలుగా రూపాంతరం చెందనున్నాయి. 1947 నుంచి ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అధికారికంగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరిస్తాయి. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఐఏఎస్ అధికారులు గిరీష్ చంద్ర ముర్ము, ఆర్కే మాథుర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్లుగా గురువారం శ్రీనగర్, లేహ్‌లో జరిగే కార్యక్రమాల్లో బాధ్యతలు స్వీకరిస్తారు. జమ్మూకాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ వీరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జమ్మూకాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈనెల 31వ తేదీలోగా లెఫ్ట్‌నెంట్ జనరల్స్‌ను నియమించాల్సి ఉంటుంది. దేశంలో కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడం ఇదే మొదటిసారి. జమ్మూకాశ్మీర్‌కు
స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసిన తర్వాత అక్కడి అభివృద్ధిని, శాంతిభద్రతల అంశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విభజనను కేంద్రం నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో జమ్మూకాశ్మీర్‌కు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని తొలగిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలో వచ్చిన మూడు నెలల్లోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 5న తీసుకున్న ఈ నిర్ణయంతో 72 ఏళ్ల కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తికి తెరపడింది. అప్పటి రాజు మహారాజా హరి సింగ్ 1947 అక్టోబర్ 26న జమ్మూకాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేశారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశం మొత్తమీద ఉన్న 560 సంస్థానాలను లేదా చిన్న చిన్న రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర వహించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి రోజునే రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించడం గమనార్హం. జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్రం ఇప్పటికే అక్టోబర్ 31ని ప్రకటించింది. కాగా, ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగే ఐక్యతా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్‌లోని కెవాడియాలో జరిగే కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిధులుగా హాజరవుతారు. ఇదిలావుంటే, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు నేరుగా కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో ఉంటాయి. పుదుచ్చేరి మాదిరిగానే జమ్మూకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా అసెంబ్లీ ఉంటుంది. లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం చండీఘఢ్ మాదిరిగా చట్ట సభ లేకుండా కొనసాగుతుంది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్ట్‌నెంట్ జనరల్స్ ఉంటారు. భవిష్యత్తులో జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఏర్పడుతుంది. అయితే, లడఖ్ మాత్రం నేరుగా కేంద్ర పాలన కింద కొనసాగుతుంది.

పాలన ఇలా…

జమ్మూ, లడఖ్‌లు గురువారం నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్న తరుణంలో ఇక్కడి పరిస్థితుల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇకపై పోలీసు వ్యవస్థతో పాటు శాంతి భద్రతల నియంత్రణ నేరుగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్లిపోనున్నాయి. అలాగే, ఇక్కడి భూములన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పరిధిలోకి రానున్నాయి. కేంద్రం పరిధిలోని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్న విధంగానే జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం – 2019 ప్రకారం ఇక్కడి భూములపై సర్వ హక్కులు స్థానిక ప్రభుత్వానికే సంక్రమించనున్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని యావత్ కాశ్మీర్ లేక ఇక్కడి మరే ఇతర ప్రాంతానికి సంబంధించిన వివిధ అంశాలను చట్ట రూపంలోకి తీసుకొచ్చే అధికారం ఇక్కడి ప్రభుత్వానికి ఉంటుంది. ఢిల్లీ, పుదుచ్చేరిల్లోని పోలీసు, శాంతి భద్రతలు అక్కడి ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నప్పటికీ వాటి నియంత్రణ మాత్రం కేంద్రం ఆధీనంలోని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) చేతుల్లోనే ఉన్నాయి. ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) ఎన్నికైన ప్రభుత్వం పరిధిలో కాకుండా ఎల్‌జీ ఆధీనంలోనే కొనసాగుతాయి. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్, ఏసీబీలు ఎల్‌జీ పరిధిలో కొనసాగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి, ఎల్‌జీకి మధ్య తరచు విభేదాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జమ్మూ కాశ్మీర్ విభజన చట్టం మేరకు భూములు, దానికి సంబంధించిన హక్కులు, బదిలీలు, వ్యవసాయ భూమి పరాధీనం, వ్యవసాయ రుణాలు తదితర వ్యవహారాలు మాత్రం జమ్మూ కాశ్మీర్ యూటీలో ఎన్నికైన ప్రభుత్వం పరిధిలోకే వస్తాయి. భూముల సర్వే, రెవెన్యూ, బదిలీలు, ల్యాండ్ రికార్డులు ఎన్నికైన ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అయితే, లడక్ కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రం పోలీస్, శాంతి భద్రతలు, భూ లావాదేవీలకు సంబంధించిన అంశాలు కేంద్రం పరిధిలో ఉంటూ ఎల్‌జీ నియంత్రణలో కొనసాగనున్నాయి. చట్ట ప్రకారం లడక్‌కు శాసనసభ ఉండదు.
గురువారం నుంచి జమ్మూ, లడక్‌లు కేంద్ర ప్రాంతాలుగా మారుతున్నప్పటికీ హైకోర్టు మాత్రం ఉమ్మడిగానే ఉంటుంది. జడ్జిలు కూడా ఉమ్మడి హైకోర్టులోనే రెండు యూటీలకు సంబంధించిన లావాదేవీలను కొనసాగిస్తారు. కొత్త చట్టం ప్రకారం.. ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్‌లు వారి వారి క్యాడర్‌లలోనే కొనసాగుతారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ పరిధిలో 107 మంది అసెంబ్లీ స్థానాలు ఉండగా పునర్విభజన చట్టం మేరకు 114 స్థానాలుగా మారాయి. చట్ట ప్రకారం.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలో ఉన్న 24 స్థానాలు ఖాళీగా ఉంటాయి.

Source : Andhra Bhoomi

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.