News

వలస కార్మికులపై పైశాచకత్వం

474views

పుల్గామ్ జిల్లాలోని ఓ యాపిల్ గార్డెన్‌లో పనిచేస్తున్న నరుూముద్దీన్ షేక్, ముర్సాలిమ్ షేక్, రోఫిక్ షేక్, టమ్రుద్దీన్ షేక్, రోఫికుల్ షేక్‌ను ఉగ్రవాదులు మంగళవారం కాల్చిచంపారు. మరో వలస కార్మికుడు జహీరుద్దీన్ షేక్ తీవ్రంగా గాయపడడంతో అతనిని కాశ్మీర్‌లోని ఆసుపత్రికి తరలించారు. జహీరుద్దీన్‌కు రెండు నెలల కిందటే వివాహం జరిగింది. ఈ ఆరుగురు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా, బహాల్‌నగర్‌కు చెందిన కార్మికులు. తమను ఉగ్రవాదులు తీవ్రంగా బెదిరించారని జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం జరిగిన దాడిలో మృతి చెందిన వలసకూలీల బంధువులు తెలిపారు. కాశ్మీరేతరులు అక్కడ ఉండడానికి వారు పలుమార్లు బెదిరించారని, చివరికి ఈ విధంగా దాడి చేశారని వారు పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. కోల్‌కతాకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ముర్షిదాబాద్ జిల్లా నుంచి వందలాది శ్రామికులు జమ్మూకాశ్మీర్‌లోని పలు తోటల్లో పనిచేస్తున్నారు. ఇటీవలకాలంలో వేర్పాటువాదులు యాపిల్ పెంపకంపై అప్రకటిత నిషేధాన్ని విధించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం చొరవతో రాష్ట్ర పాలనా యంత్రాంగం అక్కడ భారీ భద్రత మధ్య యాపిల్ తోటల నిర్వహణ సజావుగా సాగేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాన్ని సహించలేకపోతున్న ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ప్రత్యక్షంగా అక్కడి వలస కూలీలను బెదిరిస్తున్నారని బాధిత కుటుంబీకులు పీటీఐకి చెప్పారు.

రోదిస్తున్న మృతుడి బంధువులు

బతుకుతెరువు కోసం వెళ్లిన వారిపై దాడులు చేయడం అమానుషమని వారు వాపోయారు. జమ్మూకాశ్మీర్‌లో ఇప్పటికీ భయానక వాతావరణం కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.