News

పాకిస్థాన్ పై అంతర్జాతీయంగా మరో విజయం సాధించిన భారత్..!

540views

పాకిస్థాన్ పై అంతర్జాతీయంగా భారత్ మరో విజయం సాధించింది. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉంటోన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ పై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో విజయం సాధించింది. వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) స్పష్టం చేసింది. ఆయన నిర్బంధం అక్రమమని.. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పాక్ కు ఆదేశాలు జారీ చేసింది.

కొద్దిరోజుల క్రితం భారత్ పై అక్కసుతో కుల్ భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్థాన్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్ జైలులో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్ జాదవ్ విషయంలో మరోసారి పాకిస్థాన్ పిచ్చి ప్రేలాపనలకు పోయింది. ఇప్పటికే ఒకసారి కుల్‌ భూషణ్ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇచ్చిన పాకిస్థాన్, ఇక రెండోసారి కాన్సులర్ యాక్సెస్ ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పేసింది.

గూఢచర్యంలో ఆరోపణల కేసులో పాక్ ఆర్మీ కోర్టు భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో విచారణ జరిపిన ఐసీజే.. కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్షపై స్టే ఇచ్చింది. అంతేకాకుండా వియన్నా ఒప్పందం ప్రకారం కుల్ భూషణ్ జాదవ్ హక్కులను పాక్ ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Source : Bharath Today

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.