
తిరుమల: శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు సూచించింది.
దర్శనం, ఆర్జిత సేవలు, వసతి తదితర బుకింగ్‌లు ఇప్పిస్తామంటూ నమ్మించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయని టీటీడీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్, అధికారిక యాప్ ద్వారా మాత్రమే బుకింగ్‌లు చేసుకోవాలని స్పష్టం చేసింది.
టీటీడీ పేరు, లోగోతో నకిలీ సైట్లు
టీటీడీ పేరు, లోగో, స్వామివారి చిత్రాలు, ట్రేడ్‌మార్క్‌లను దుర్వినియోగం చేస్తూ కొందరు నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఐటీ, విజిలెన్స్, సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
రెండేళ్లలో 259 ఫేక్ వెబ్‌సైట్లు గుర్తింపు
గత రెండేళ్లలో 259 నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి తొలగించినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ నకిలీ వెబ్‌సైట్లకు సంబంధించి పలువురు వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపింది.
భక్తులు సోషల్ మీడియా, వాట్సాప్ లేదా ఇతర మార్గాల్లో వచ్చే అనధికారిక బుకింగ్ లింకులు, వ్యక్తిగత ఖాతాలకు డబ్బు పంపే సూచనల పట్ల జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది. శ్రీవారి దర్శనం, సేవలు, వసతి కోసం అధికారిక టీటీడీ మార్గాల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.





