News

మంగినపూడి తీరంలో 63 అడుగుల మట్టి “విజయ గణపతి”

5views

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సాగర తీరంలో 63 అడుగుల భారీ మట్టి ‘విజయ గణపతి’ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాలను ‘మంగినపూడి సాగర తీర మహా గణపతి ఉత్సవ సేవా సమితి’ ప్రతినిధులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

మచిలీపట్నం నగర సమగ్రాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మంగినపూడి బీచ్‌లో 63 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.

వచ్చే ఏడాది మచిలీపట్నం పోర్టు అందుబాటులోకి రానుందని, పోర్టుకు అనుబంధంగా అనేక భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని సమితి సభ్యులు తెలిపారు. ఈ బృహత్తర అభివృద్ధి పనులు ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా శీఘ్రగతిన పూర్తికావాలని ఆకాంక్షిస్తూ ‘విజయ గణపతి’ని ప్రతిష్ఠిస్తున్నట్లు పేర్కొన్నారు.

పరిసర ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి సేకరణ
భారీ మట్టి గణపతి విగ్రహం తయారీ కోసం మచిలీపట్నం పట్టణంతో పాటు పరిసర గ్రామాలు, ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక దివ్య యజ్ఞంగా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తున్నామని ఉత్సవ సేవా సమితి ప్రతినిధులు తెలిపారు.

భక్తి, ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నామని, విజయ గణపతి ఆశీస్సులతో మచిలీపట్నం అభివృద్ధి మరింత వేగం పుంజుకోవాలని ఆకాంక్షించారు.