News

ప్రకృతి ఆహారంపై దృష్టిపెడదాం

334views

ప్రకృతి’ సమష్టి జీవరాశులకు దేవుడిచ్చిన గొప్ప వరం.. భూమి, నీరు, నింగి, గాలి, ఆకాశం వీటన్నింటి వల్లే జీవి మనుగడ సాధ్యమవుతోంది.. సహజసిద్ధ పంటల నుంచి లభించే తాజా కూరగాయాలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, చిరుధాన్యాలు.. తదితర వాటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇది మన చేతుల్లోనే ఉందని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడ్డారు. పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా తిరుపతి చాప్టర్, జూనియర్‌ ఛాంబర్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో ‘సంపూర్ణ ఆరోగ్యం’పై అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, ప్రకృతి వనం ప్రసాద్, జేసీఐ జోన్‌ ఛైర్మన్‌ గోపి కిషోర్, పీఆర్‌ఎస్‌ఐ తిరుపతి చాప్టర్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కార్యదర్శి చంద్రమోహన్, కోశాధికారి చక్రవర్తి రాఘవన్, పీఆర్‌ఎస్‌ఐ మాజీ ఛైర్మన్లు స్వరాజ్యలక్ష్మి, త్రిపురసుందరి తదితరులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

శరీరం చెప్పినట్లు వినాలి
మనకు ఏం కావాలో మన శరీరం చెప్తుంది. దాన్ని మనం గుర్తించి శరీరానికి కావాల్సినంత ఆహారాన్ని ఇవ్వాలి. రుచిగా ఉందని ఎంతపడితే అంత తినకూడదు. రెండు లీటర్ల శీతలపానీయాలు, ఆరు బీరు బాటిళ్లు తాగడానికి ఇష్టపడే ప్రజలు ఐదు గ్లాసుల రాగిజావ తాగడానికి కష్టపడుతున్నారు. పూర్వకాలం నుంచి మన పెద్దలు పాటిస్తున్న ఉపవాసంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉపవాస సమయంలో శరీరంలో ప్రతి అవయవం తనుకుతానే పునరుత్తేజితం అవుతుంది. తద్వారా అవయవాలు పాడవకుండా ఉంటాయి. వారంలో ఒకరోజైనా ఉపవాసం ఉండటం మంచింది. తృణధాన్యాలతోపాటు రాగులు, సజ్జలు విరివిగా వాడాలి. ప్రతిఒక్కరూ ఆధునిక ఆహార అలవాట్లను పునఃపరిశీలించుకోవాలి.– వనం ప్రసాద్, ప్రకృతి వ్యవసాయ నిపుణులు