
హోళీ ఉత్సవం మాధ్యమంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జాతీయ ఐక్యత గురించి కీలక సందేశమిచ్చారు. ఐకమత్యం అన్న దానిని నొక్కి చెప్పారు. భారత ప్రజలు ఐక్యంగా వున్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. భారత్ ఐక్యంగా వుంటే ఏ శక్తీ కూడా మన దేశం అభివృద్ధి చెందకుండా ఆపలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.గోరఖ్ పూర్ లో నిర్వహించిన హోళీ కార్యక్రమంలో సీఎం యోగి అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. గోరఖ్‌నాథ్ ఆలయ సముదాయంలోని హోలికా దహన్ స్థలంలో పూజ, హారతి నిర్వహించిన అనంతరం హోలీ వేడుకలను ఆయన ప్రారంభించారు.
వందలాది సంవత్సరాలు మన దేశం బానిసత్వంలో మగ్గిందని, దేశంపై దండెత్తి వచ్చిన ముష్కరులు మన విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారని అన్నారు. హోలి, దీపావళి, మహాకుంభ్ వంటి ఈవెంట్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన శక్తులను కూడా మనం చూశామని, అయినప్పటికీ ఏ ఒక్కరూ మన సంప్రదాయాలను అడ్డుకోలేకపోయారని అన్నారు. పండుగల పరంపరం, సాంప్రయాదాలు కొనసాగుతూనే వస్తున్నాయని చెప్పారు.
సనాతన ధర్మం అనేది కులం, మతం, ప్రాంతం, తెగల వారిగా విడిపోయిందంటూ ప్రచారం చేసిన వాళ్లకు మహాకుంభ్ గట్టి సమాధానం ఇచ్చిందని యోగి ఆదిత్యనాథ్ గుర్తుచేశారు.
ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి మోదీ కంకణం కట్టుకున్నారని, అందరూ ఐక్యంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తీ భారత్ అభివృద్ధిని అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. మన శక్తియుక్తులన్నీ దేశానికి అంకితం చేయాలని పిలిపునిచ్చారు. ఐక్యత ద్వారానే భారతదేశం సమైక్యంగా మనగలుగుతుందన్నదే హోలీ పండుగ మనకు ఇచ్చే సందేశం అని యోగి తెలిపారు.





