
అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి చేస్తున్న నేపథ్యంలో భారత్ లోని రైతులు, చిన్న వ్యవస్థాపకుల ప్రయోజనాలను కాపాడుకోవాలని స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ఎం) పిలుపునిచ్చింది. దీని కోసం పలు దేశాలతో బహుళపక్ష ఒప్పందం కుదుర్చుకోవడం కన్నా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రతిపాదించింది. స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ మండలి సమావేశం ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగింది. ఈ మేరకు సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. రెండురోజుల పాటు జరిగిన సదస్సులో ప్రధానంగా ట్రంప్ ప్రతీకార సుంకాలపై చర్చించారు. ఇతర దేశాల ఎగుమతులపై అధిక సుంకాలు విధించడం ద్వారా వాటిని అడ్డుకొని, స్వదేశంలో పారిశ్రామికోత్పత్తిని పెంచుకోవాలన్నదే ట్రంప్ వ్యూహమని ఎసీఎం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో భారత్ బహుళదేశాలతో కాకుండా అమెరికా తదితర దేశాలతో నేరుగా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించింది. అలా జరిగినప్పుడే మన రైతుల, చిన్న పరిశ్రమల ప్రయోజనాలను కాపాడుకోవ చ్చని తెలిపింది.





