ArticlesNews

కోనేటిపై కొండల రాయడు

353views

( మార్చి 9 – తిరుమలలో తెప్పోత్సవాలు ప్రారంభం )

జలం, జగన్నాథులది అవినాభావ సంబంధం. ఆ సంబంధాన్ని స్మరించుకునేందుకే పుణ్యక్షేత్రాల్లో తటాకాలు వెలిశాయి. తిరుమలలో ఆనందనిలయానికి ఈశాన్యంగా ఉన్న కోనేరు పరమపవిత్రం. శ్రీమహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తరలించి, ఏడుకొండలపై ప్రతిష్ఠించాడన్నది కథనం. వామన, వరాహ, స్కంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాల్లో తిరుమల పుష్కరిణి ప్రస్తావన ఉంది. ఈ కోనేరులో సకల తీర్థాలూ లీనమై ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. శ్రీస్వామి పుష్కరిణి స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశీ వ్రతం- ఈ మూడూ మహిమాన్వితమైనవని ధర్మగ్రంథాలు చాటుతున్నాయి. బ్రహ్మాండంలోని సర్వతీర్థాలకు శ్రీమహావిష్ణువే ప్రభువు. రాయడంటే రాజు. తిరుమల కోనేటికి రాజైన శ్రీనివాసుడు కోనేటిరాయడయ్యాడు.

సప్తగిరులపై పుష్కరిణిలో శ్రీనివాసుడికి జరిగే తెప్పోత్సవం నయనమనోహరం. ‘తెప్ప’ పదానికి పడవ, ఓడ అనే అర్థాలున్నాయి. శ్రీవేంకటేశ్వరుడి ఉపచారాలకు వివిధ రీతుల్లో ఉపయోగపడే ఈ కొలను మహిమాన్వితం. పుణ్యక్షేత్రాల సమీపంలోని జలాశయాల్ని పరమపవిత్రంగా భావించాలని గుర్తుచేసేందుకే తెప్పోత్సవాలని తాత్వికులు చెబుతారు. శ్రీవేంకటేశ్వరుని కోనేటిలో విహరింపజేసే ఈ తెప్పోత్సవాలకు తిరునాళ్లు, క్షీరార్ణవ ఉత్సవాలు, ప్లవోత్సవాలు అనే పేర్లు కూడా ఉన్నాయి.
తెప్పోత్సవాలకు ఘనచరిత్ర ఉన్నట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. 1468లో ఈ వేడుకల కోసమే పుష్కరిణి మధ్యలో సాళువ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించాడు. ఏటా ఫాల్గుణమాసంలో శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అయిదు రోజుల పాటు అంగరంగవైభవంగా తెప్పోత్సవాలను నిర్వహించటం ఆనవాయితీ. తెప్పపై మొదటిరోజు సీతారామలక్ష్మణులను, రెండోరోజు శ్రీరుక్మిణీకృష్ణులను ప్రదక్షిణ చేస్తున్నట్టుగా విహరింపజేస్తారు. మూడో రోజున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని విహరింపజేస్తారు. నాలుగోరోజు శ్రీదేవి, భూదేవులతో కూడి శ్రీవేంకటేశ్వర స్వామివారు అయిదు ప్రదక్షిణలు, ఆఖరి రోజు ఏడుసార్లు తెప్పలో విహరిస్తారు. పదకవితా పితామహుడు అన్నమయ్య తిరుమలదేవుడి తెప్పోత్సవంలో పాల్గొనటమే కాదు, పదాలు అల్లి పరవశించిపోయారు. ‘తెప్పగా మర్రాకుపై తేలేటివాడు..’, ‘తెప్పల కోనేటిరాయ..’ అంటూ శ్రీనివాసుణ్ణి ప్రస్తుతించారు. ‘దేవునికి, దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేల మొక్కులు లోకపావని..’ అంటూ కీర్తించారు. ప్రతివాది భయంకర అణ్ణన్‌ ‘శ్రీవేంకటేశ్వర సుప్రభాతం’ లో స్వామివారి పుష్కరిణిని ప్రస్తావించారు.

తెప్పలపై తిరుమలేశుని రాణికీ తిరునాళ్లు
తిరుమలలో వెలసిన అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడే కాదు, తిరుచానూరులో కొలువుతీరిన శ్రీ పద్మావతి అమ్మవారు కూడా తెప్పోత్సవాల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తుంది. ఏటా జ్యేష్ఠమాసంలో ఏకాదశి నుంచి పున్నమి వరకు ఐదురోజుల పాటు సాయంవేళలో పద్మసరోవరంలో అలమేల్మంగమ్మకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో, మొదటిరోజు రుక్మిణీసత్యభామా సమేత శ్రీకృష్ణస్వామివారు, రెండో రోజు శ్రీదేవీభూదేవీ సమేతంగా సుందరరాజస్వామివారు, చివరి మూడు రోజులు పద్మావతి అమ్మవారు తెప్పలపై శోభాయమానంగా దర్శమిస్తారు.