News

భారత్‌పై కుమ్మక్కై.. చైనా, పాక్‌ సంబంధాలపై ఆర్మీ చీఫ్

222views

చైనా, పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండింటి మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలను భారత్ తప్పక అంగీకరించాలన్నారు. ఈమేరకు ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.

‘‘వర్చువల్ డొమైన్‌లో ఆ రెండు దేశాల మధ్య బంధం వందశాతంగా ఉంది. భౌతికంగా పరిశీలిస్తే.. చైనాలో తయారైన మిలిటరీ ఉత్పత్తులను పాక్‌ వినియోగిస్తోంది. రెండువైపుల నుంచి యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవం. అలాగే వేసవి సమీపిస్తున్నకొద్దీ జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లు పెరిగే అవకాశం ఉంది. సరిహద్దుల వెంబడి చొరబాట్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఉగ్రవాదుల కదలికలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని ద్వివేది వెల్లడించారు.

ఇక, ఉగ్రవాద కట్టడికి భారత సైన్యం గట్టి చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈవిషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. 2018 నుంచి ఉగ్రవాద ఘటనల సంఖ్య 83 శాతం తగ్గాయన్నారు. కేవలం 45 మంది మాత్రమే ఉగ్ర కార్యకలాపాల వైపు ఆకర్షితులయ్యారని చెప్పారు. సైన్యం చర్యలతో పర్యటకం పెరిగిందన్నారు.