News

ఖలిస్థానీ శక్తులపై బ్రిటన్‌ ‘ఉదాసీనత’ కనబడుతోంది: విదేశాంగ శాఖ

284views

కేంద్ర మంత్రి జైశంకర్‌ బ్రిటన్‌ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా లోపంపై భారత విదేశాంగశాఖ మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన ఖలిస్థానీ ఉగ్రవాద శక్తుల బెదిరింపులపై ‘బ్రిటన్‌ ఉదాసీనత’ను ప్రతిబింబిస్తోందని, వారి చర్యలకు వారికి లైసెన్సు ఇచ్చినట్లుగానే కనిపిస్తోందని పేర్కొంది. ఈ విషయంలో తమ ఆందోళనను యూకే అధికారులకు తెలియజేశామని తెలిపింది. బ్రిటన్‌ ప్రకటనపై స్పందిస్తూ.. దుశ్యర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. తద్వారా బ్రిటన్‌ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపింది.

‘‘ఈ ఘటన వెనక సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. బ్రిటన్‌లో మా దౌత్య కార్యకలాపాలకు ఆటంకం కలిగించే ఉద్దేశంతో చేసిన బెదిరింపులుగా చూడాలి. బెదిరింపు ధోరణికి పాల్పడే అటువంటి శక్తులపై ఉదాసీనతగా వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో అన్నారు.

మరోవైపు బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించడం, తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని విడుదల చేయడంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుస్థిర, ప్రశాంత, సమ్మిళిత, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు మద్దతిస్తామని పేర్కొంది. ‘‘తీవ్ర నేరాల్లో శిక్షను అనుభవిస్తున్న వారిని విడుదల చేయడం, బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. హిందువులు సహా ఇతర మైనారిటీలు, వారి ఆస్తులు, ప్రార్థనా మందిరాలకు రక్షణ కల్పించడం బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యత’’ అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.