
ఒక వీరుడి పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు ఛావా చిత్రంలో చూపించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలోని ఓ థియేటర్‌లో ఆ సినిమాను బుధవారం ఆయన చూశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్ మొదటి స్వాతంత్య్ర సమరయోధులని తెలియజేశారు. అలాంటి వారి చరిత్రను సినిమాగా తీసిన దర్శక, నిర్మాతలను అభినందించారు. వీర సావర్కర్ వర్ధంతి రోజున మరో వీరుడి సినిమా చూడడం ఆనందం కలిగించిందని అన్నారు. మన దేశానికి వలస పాలకులుగా వచ్చిన వారిని హీరోలుగా చరిత్రకారులు సృష్టించారని ఆరోపించారు. 60 ఏళ్లకు పైగా దేశాన్ని ఏలిన పార్టీ… మొగల్‌లు గొప్పవారనే భావన కలిగించడాన్ని తప్పు పట్టారు. తల్లి, తండ్రి, సోదరులను చంపిన వారిని గొప్ప వారుగా ఆ పార్టీ ఎలా చూపించిందని ప్రశ్నించారు. చరిత్ర హీనుడి గురించి గొప్పగా ఆ పార్టీ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి యువత శంభాజీ, శివాజీ లాంటి వారి చరిత్ర చదవాలని సూచించారు. సమకాలీన చరిత్రకారులపైన సినిమాలు తీయాలి కానీ… వ్యాపారం కోసం స్మగ్లర్లను హీరోలుగా చూపించే విధానం సరి కాదని అభిప్రాయపడ్డారు.




