
ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా అనంతరం బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలోనే హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు, విధ్వంస కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నడుమ రాజకీయ పక్షాలను ఉద్దేశించి దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు తమలో తాము పోట్లాడుకోవద్దని, ఈ అంతర్గత పోరు దేశ సార్వభౌమత్వానికి పెనుముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, నేరస్థులు దీన్ని అనుకూలంగా మలచుకుంటున్నారని ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
‘‘దేశంలో శాంతిభద్రతల క్షీణతకు కొన్ని కారణాలు ఉన్నాయి. మనమంతా గొడవల్లో నిమగ్నమై ఉండటం మొదటి కారణం. మనలో మనమే పోట్లాడుతున్నాం. విభేదాలను పక్కనపెట్టకుండా.. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ఘర్షణలకు దిగడం ద్వారా దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం ప్రమాదంలో పడుతుంది. ఇటువంటి పరిస్థితులను దుండగులు తమకు అనుకూలంగా మలచుకుంటుకున్నారు. గందరగోళం సృష్టించే బదులు.. బంగ్లాదేశీయులంతా ఐక్యంగా ఉంటూ దేశాన్ని కాపాడుకోవాలి. నేను మళ్లీ హెచ్చరిస్తున్నా. అప్పుడే ఎందుకు అప్రమత్తం చేయలేదంటూ భవిష్యత్తులో నన్ను అనొద్దు’’ అని ఓ కార్యక్రమంలో వకార్ స్పష్టం చేశారు.




