
ఏ కోణంలో చూసినా ప్రపంచ రాజకీయ పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో కృత్రిమ మేథ, ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్షం, డ్రోన్లు, గ్రీన్ హైడ్రోజన్ వంటి అంశాల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కచ్చితంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రస్తుతం సంఘర్షణ పరిస్థితులు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆహార భద్రత, కొవిడ్ మహమ్మారి సవాళ్లు, వాతావరణ ఆందోళనలను ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయన్నారు. జీ 20 మన ఆసక్తులు, సంస్కృతులు, దృక్పథాల వైవిధ్యాన్ని సంగ్రహిస్తుందన్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సమస్యలను ఎదుర్కోవడంలో, ప్రపంచ దేశాల ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడంలో జీ20 కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ సమాఖ్యను కాపాడుకోవడం ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యమని అన్నారు. ప్రపంచ దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారి విచ్ఛిన్నానికి దారితీయకూడదని పేర్కొన్నారు.
ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకం..
పశ్చిమాసియా ఘర్షణలు, సముద్ర భద్రత, ఉక్రెయిన్ వివాదం, ఇండో-పసిఫిక్, యూఎన్ సంస్కరణలపై భారతదేశ వైఖరిని జైశంకర్ తెలిపారు. గాజా కాల్పుల విరమణ, బందీల విడుదలను దేశం స్వాగతిస్తోందని అన్నారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని.. మానవతా సహాయానికి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఘర్షణలు నెలకొంటున్న ఆయా ప్రాంతాల్లో శాంతి, సుస్థిరత నెలకొనడం ప్రపంచ దేశాలకు చాలా అవసరమని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఒకదానికి ఒకటి సహాయ, సహకారాలు అందించుకోవాలని.. అంతర్జాతీయ చట్టం ప్రకారం కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ వివాదంపై జైశంకర్ మాట్లాడుతూ.. యుద్ధం నివారించడానికి ఇరుదేశాల అధినేతలు చర్చల్లో పాల్గొనాలని భారత్ చాలాకాలంగా సూచిస్తోందని అన్నారు. భారత్ యుద్ధాన్ని ప్రోత్సహించదని.. దౌత్యాన్ని సమర్థిస్తుందని పేర్కొన్నారు. ఈ సమస్యకు త్వరలో ముగింపు పలకాలని కోరుతున్నట్లు తెలిపారు.





