News

భారత సంతతి బాలుడి స్మారకార్థం బ్రిటన్‌లో చట్టం

210views

కత్తిపోటుతో హత్యకు గురైన భారత సంతతి బాలుడి స్మారకార్థం బ్రిటన్‌ ప్రభుత్వం కొత్త చట్టం రూపొందించి ఆంక్షలు విధించింది. ఆన్‌లైన్‌లో కత్తులు విక్రయించేవారు కఠిన నిబంధనలను పాటించాలని, నిబంధనల అమలును పట్టించుకోని వారు భారీగా జరిమానాలను చెల్లించాల్సి ఉంటుందని బ్రిటన్‌ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రోనన్‌ చట్టం ప్రకారం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారాలు.. పెద్దమొత్తంలో కత్తులు కొనుగోలు చేసే వారి గురించి పోలీసులకు నివేదించాలి. 18 ఏళ్లలోపు వారికి కత్తులు విక్రయించేవారిపై కఠిన శిక్షలు విధించాలి. భారత సంతతికి చెందిన రోనన్‌ కంద అనే పదహారేళ్ల బాలుడు 2022 జులైలో వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌ పరిధిలోని వోల్వర్‌హంప్టన్‌ వద్ద కొందరు కత్తితో దాడిచేయడంతో అక్కడికక్కడే మరణించాడు. రోనన్‌ కందను హతమార్చిన భారత సంతతికి చెందిన వ్యక్తి సహా ఇద్దరు టీనేజర్లకు 34 సంవత్సరాల జైలుశిక్ష పడినా.. మరింత కఠినచర్యలు తీసుకోవాలంటూ బాలుడి తల్లి పూజా కందా ప్రచారం చేస్తున్నారు. బ్లేడ్లు, కత్తుల అమ్మకందారులు, కొనుగోలుదారులు, సోషల్‌ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వాటికి సంబంధించిన ఆన్‌లైన్‌ విక్రయాల్లో ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలుపరచడాన్ని స్వాగతిస్తున్నామని పూజా కందా పేర్కొన్నారు.