
అంతర్జాతీయ వేదికలపై ప్రతిసారీ భారత్‌పై అక్కసు వెళ్లగక్కడం పాకిస్థాన్‌కు ఓ దురలవాటు. దాయాది దేశం తోకముడిచేలా చెంపచెళ్లుమనిపించే సమాధానం మనం ఇస్తున్నా దాని బుద్ధి మారడం లేదు. తాజాగా మరోసారి పాక్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఆ దేశం ఎగదోస్తున్న ఉగ్రవాదానికి తాము బాధితులమని వెల్లడించింది. జైషే మహమ్మద్ వంటి సంస్థలను ప్రోత్సహించే పాక్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడం అత్యంత హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తంచేసింది.
చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలో జమ్మూకశ్మీర్‌ను ఉద్దేశించి పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్ వ్యాఖ్యలు చేశారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీస్ వాటికి దీటుగా బదులిచ్చారు. ‘‘ఐరాస ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న 20 సంస్థలను పాక్ పెంచి పోషిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. అలాంటి దేశం ఉగ్రవాద వ్యతిరేక పోరులో ముందువరుసలో ఉందని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఈ దేశ ఉగ్ర కార్యకలాపాలకు మేం బాధితులం. అమాయక పౌరులపై జరిగే ఉగ్రవాద చర్యలకు ఎలాంటి సమర్థన ఉండదు. ఉగ్రవాదుల్లో మంచి, చెడు అని తేడా ఉండదు. ఇక ఇలాంటి మాటలతో మండలి సమయాన్ని వృథా చేయొద్దు’’ అని పాక్ మంత్రికి హితవు పలికారు.
జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని తేల్చిచెప్పారు. కొన్నినెలల క్రితం జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పడటం గురించి ప్రస్తావించారు. ‘‘కశ్మీర్ ప్రజల ఎంపిక చాలా స్పష్టంగా ఉంది. పాకిస్థాన్ మాదిరిగా కాకుండా అక్కడ ప్రజాస్వామ్యం బలంగా ఉంది’’ అని సోదాహరణంగా పాక్‌కు మొట్టికాయలు వేశారు.
కశ్మీర్ అంశానికి సంబంధించి పాకిస్థాన్ తన మొండి వాదనను వినిపిస్తూనే ఉంది. కశ్మీరీలు తమ ప్రజాస్వామ్య హక్కులు వినియోగించుకునేందుకు వీలుగా ఐరాస భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలుచేయాలని కోరింది. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని కోరుతూ చేసిన ఓ తీర్మానాన్ని పాక్ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే, కశ్మీర్‌కు మద్దతుగా పాకిస్థాన్ తీర్మానం చేయడం ఇదే మొదటిసారి కాదు.
ఈ తీర్మానం సందర్భంగా కశ్మీర్ వ్యవహారాల మంత్రి ఇంజనీర్ అమీర్ ముకమ్ మాట్లాడుతూ.. కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పాకిస్థాన్ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతు ఇస్తుందన్నారు. మానవ హక్కుల పరిస్థితులను మెరుగుపరచాలని, నిర్బంధించిన నేతలను విడుదల చేయడంతో పాటు అణచివేత ధోరణిని విడనాడాలని భారత్‌ను కోరుతున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు.





