
306views
లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు రూపొందించిన జలాంతర్గామి ‘మత్స్య-6000’ ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) ఓ ప్రకటనలో తెలిపింది. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా నాలుగో తరం జలాంతర్గామిని అభివృద్ధి చేసే పనిని ఎన్‌ఐఓటీకి కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ అప్పగించింది. దీంతో ఆ సంస్థ ‘మత్స్య-6000’ పేరుతో జలాంతర్గామిని తయారు చేసింది. ఇందులో 2.1 మీటర్ల వ్యాసం కలిగిన గోళాకారంలో ముగ్గురు వ్యక్తులు కూర్చొని ప్రయాణించేలా ఏర్పాట్లు చేసింది. దీని ఉప వ్యవస్థలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. ఈ జలాంతర్గామిని జనవరి 27 నుంచి ఫిబ్రవరి 12 వరకు చెన్నై సమీపంలోని కాట్టుపల్లి పోర్ట్‌లో ఉన్న ఎల్‌అండ్‌టీ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీలో 500 మీటర్ల లోతులో పరీక్షించి, విజయంతమైందని ప్రకటించారు.





