News

తాళ్లపాక… పట్టించుకోక

251views

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి పరమభక్తుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమచార్యుడి స్వస్థలం రాజంపేటలోని తాళ్లపాకపై టిటిడి తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఇక్కడ సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలతోపాటు అన్నమాచార్యుల ధ్యాన మందిరాన్ని తితిదేలో మూడు దశాబ్దాల కిందట విలీనం చేశారు. అనంతరం ప్రత్యేకంగా ఆరుగురు అర్చకులతోపాటు రెండేళ్ల కిందట పర్యవేక్షణ అధికారిని నియమించారు. ఈయనకు ఆరు నెలల కిందట ఒంటిమిట్ట కోదండ రామాలయం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో తాళ్లపాకలోని ఆలయాలకు పర్యవేక్షణ కరవైంది. దీనికి తోడు నిత్య కైంకర్యాలు, పూజలు చేసేందుకు అవసరమైన సరకులు అందించాల్సినవారు కరవయ్యారని సిబ్బంది చెబుతున్నారు. సమస్యను పలుమార్లు టిటిడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అర్చకులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా తాళ్లపాక అన్నమాచార్యుల ఉత్సవాలను సైతం మమ అనిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై తాళ్లపాక ఆలయాల పర్యవేక్షణ అధికారి బాలాజీ మాట్లాడుతూ టిటిడి ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు.