News

ముంతాజ్‌ హోటల్‌ పనులు ఆపాలంటూ నిరవధిక దీక్ష

393views

తిరుపతిలోని అలిపిరి సమీపంలో ముంతాజ్‌ హోటల్‌ నిర్మాణ పనులు వెంటనే నిలుపుదల చేయాలని స్థానిక టిటిడి పరిపాలన భవనం వద్ద గోవింద శంఖారావం పేరుతో స్వామీజీలు, హిందూ సంఘాల నేతలు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. రాష్ట్ర సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి మాట్లాడుతూ తితిదే పాలకమండలి సమావేశంలో ముంతాజ్‌ హోటల్‌ స్థలాన్ని దేవస్థానానికి అప్పజెప్పాలని తీర్మానం చేయగా ఆగకపోగా నిర్మాణాలు మరింత వేగవంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వస్తే హిందువులకు మేలు జరుగుతుందని తాము ఆశించామన్నారు. గత ప్రభుత్వం 2021లో మంజూరు చేసిన ముంతాజ్‌ హోటల్‌ నిర్మాణ పనులు కొనసాగడం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానని పేర్కొన్న పవన్‌ కల్యాణ్‌ ఈ విషయంలో ఎందుకు మౌనం దాల్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నిర్మాణాలు ఆగేంతవరకు దీక్షను విరమించే సమస్య లేదని, ఇతర స్వామీజీలతో మాట్లాడామని, దేశవ్యాప్త ఉద్యమం తప్పదని పేర్కొన్నారు. హిందూ సంఘాల నేత తుమ్మ ఓంకార్‌ తదితరులు పాల్గొన్నారు.