
బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ఏరో ఇండియా 2025 షో మొదలైంది. ఇది 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ ‘‘భారత్‌లో మహాకుంభ్ జరుగుతోంది. ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ్ ఇక్కడ మొదలైంది. ప్రయాగ్‌రాజ్‌లోది ఆత్మపరిశీలనకు.. బెంగళూరులోది సృజనాత్మకత, పరిశీలన కోసం. అక్కడిది అంతర్గత సమైక్యత కోసమైతే.. ఇక్కడిది బాహ్యభద్రత కోసం. ఏరో ఇండియా మహాకుంభ్‌లో భారత్ శక్తి కనిపిస్తుంది. వికాస్ భీ.. విరాసత్ భీ అన్న మోదీ నినాదానికి అనుగుణంగా ఉంది. గత ఏరో ఇండియా నుంచి ఇప్పటివరకు మేము చాలా పురోగతి సాధించాము. అస్త్ర క్షిపణి, న్యూజనరేషన్ ఆకాశ్ మిసైల్, అండర్ వాటర్ అటానమస్ వెహికల్, అన్‌మ్యాన్డ్ సర్ఫేస్ వెస్సల్ వంటివి ఉన్నాయి. భవిష్యత్తులో మరింత వేగంగా ముందుకువెళతాము’’ అని పేర్కొన్నారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ ‘‘దేశలో వైమానిక రంగానికి బెంగళూరు రాజధాని. సృజనాత్మకత, ప్రపంచస్థాయి భాగస్వామ్యాలను ఆకర్షించేందుకు కర్ణాటక ఎప్పుడూ ముందుంటుందన్నారు. దేశ ఏరోస్పేస్, డిఫెన్స్‌రంగాల పరిశోధనల్లో 60శాతం ఇక్కడినుంచే వస్తాయి. వాణిజ్య, రక్షణ విమానాశ్రయాలను నిర్వహిస్తున్న ఏకైక నగరం బెంగళూరే’’ అని పేర్కొన్నారు.
ఈ ప్రదర్శనలో 27 దేశాల రక్షణ మంత్రులు, డిప్యూటీ మంత్రులు, 15 దేశాల రక్షణ, సేవారంగాల చీఫ్‌లు, 12 దేశాల రక్షణశాఖ కార్యదర్శులు పాల్గొంటారు. మొత్తం 80 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ వేదిక నుంచి తమ రక్షణ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. ఇక రాష్ట్రంలో కార్యాలయాలు ఉన్న హెచ్‌ఏఎల్, బోయింగ్, ఎయిర్‌బస్, ఇస్రో, ఎన్‌ఏఎల్, రోల్స్‌రాయిస్, ఎయిర్ ఇండియా, జీఈ ఏరోస్పేస్, మహీంద్ర ఏరోస్పేస్ తదితరాల ఆధునిక ఉత్పత్తులు ఈ ప్రదర్శలో ఆకర్షణగా నిలువనున్నాయి.





