News

ముగ్గురు పిల్లలను కనండి : హిందూ యువతకు వీహెచ్‌పీ పిలుపు

312views

హిందూ యువత జనాభా అసమతుల్యతను అధిగమించాలని, ప్రతి జంటా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు కంటామని హిందూ యువత యావత్తూ ప్రతిన పూనాలని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పిలుపునిచ్చింది. ప్రస్తుత జననరేటు కొనసాగితే హిందువుల జనాభా తగ్గుతుందని సంస్థ పేర్కొంది. హిందువుల ప్రస్తుత జనన రేటు 1.9 శాతం. ఈ సంఖ్య ఇంతకన్నా తగ్గితే సమాజం, దేశం ప్రమాదంలో పడతాయి, అని పరిషత్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌ అన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలుండాలని ఎయిమ్స్‌ వంటి సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో తేలినట్టు ఆయన వివరించారు. ఆ శాస్త్రీయత ఆధారంగానే తాము ప్రతి ఒక్కరూ ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల్ని కనాలని అంటున్నామన్నారు. కుటుంబాలు విచ్చిన్నమవుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ విచ్ఛిత్తి పిల్లలు, వయోధికుల్లో అభద్రతా భావానికి కారణమవుతోందని హిందూ సంప్రదాయాలు పాటించడమే ఈ సమస్యకు పరిష్కారమన్నారు. మహాకుంభ్‌ నగర్‌లో జరిగిన మూడురోజుల వీహెచ్‌పీ కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ఆయన విలేకరులతో పంచుకున్నారు. హిందూ జనాభా తగ్గిన కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు ఏర్పడటాన్ని మనం చూశామన్నారు. కుటుంబ విలువలు పాటించకుంటే సమాజంలో భోగలాలసత పెరుగుతుందని చెబుతూ సహజీవనం, వివాహేతర సంబంధాలు పెచ్చుమీరడాన్ని ప్రస్తావించారు.