
విశాఖపట్నం సింహగిరిపైకి యథేచ్ఛగా అన్యమతస్తుల వాహనాలు వస్తున్నా.. సింహాచలం అప్పన్న దేవస్థానం అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సింహగిరికి వెళ్లే టోల్‌గేట్ల వద్ద అన్యమతస్తుల వాహనాలు, అన్యమత ప్రచార వ్యాఖ్యలు ఉన్న వాహనాలకు అనుమతి లేదనే బోర్డులు ఉంటాయి. అయితే సరైన నిఘా లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింహగిరికి మధ్యాహ్నం ఒక అన్యమతానికి చెందిన కారు రాగా, దేవస్థానం సిబ్బంది, అధికారులు పట్టించుకోలేదు. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. టోల్‌గేట్లు దాటి సింహగిరిపై ఉన్న జోడు భద్రాల వరకు కారు ఎలా వచ్చిందని, దేవస్థానం సిబ్బంది, గార్డులు ఏం చేస్తున్నారని బీజేపీ ధార్మిక సంస్థ రాష్ట్ర కో కన్వీనర్ ఫణీంద్ర ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న సింహాచలం దేవస్థానంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం దారుణమన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉద్యోగులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అధికారులపై చర్యలు తీసుకుని హిందూ మతాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు.





