ArticlesNews

రాళ్లే నైవేద్యం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం

248views

విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం పాలవలస పంచాయతీలో జాతీయ రహదారిపై దుక్కవానిపాలెం టోల్‌ప్లాజాను ఆనుకుని మెట్టపై వెలసిన పాలమ్మ అమ్మవారు వందల ఏళ్ల క్రితం రాయి రూపంలో వెలిశారు. అమ్మవారు చీకటి పడిన తరువాత స్త్రీ రూపంలో చుట్టుపక్కల వారికి కనిపించేవారట. తానుండే చోట రాళ్లు వేస్తే కోరికలు తీరుతాయని చెప్పడంతో.. భక్తులు రాళ్లు నైవేద్యంగా సమర్పించడం మొదలపెట్టారు. ప్రస్తుతం అక్కడ రాళ్ల గుట్టలు వెలిశాయి. విద్య, వైద్యం, పెళ్లి, భూ సమస్యలు, వ్యాపారం, ఆరోగ్యం, కోర్టు వ్యవహారం, ప్రయాణం కోసం రాళ్ల పోలమ్మకు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. రాళ్లతో పాటు పసుపు–కుంకుమ ఇచ్చి కోళ్లు, మేకలు కోసి బంధువులకు భోజనాలు కూడా పెడుతుంటారు. మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇక్కడ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రెండు రాళ్ల గుట్టల మధ్య ఇటుకలు పేర్చి రాయి రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. అమ్మవారికి చీరలు మొక్కేవారు అక్కడి దేవతా వృక్షాలకు కట్టి వదిలేస్తారు. అంతేకాకుండా తమ సంతానికి రాళ్ల పాలమ్మ పేరుపెట్టి తలనీలాలు కూడా సమర్పిస్తుంటారు. అమ్మవారు కోరితే ఆలయం, భక్తులు సేదతీరడానికి వసతులు, తాగునీరు ఏర్పాటు చేస్తామంటున్నారు పాలవలస ప్రజలు.

రాళ్ల జోలికి ఎవరూ వెళ్లరు : చుట్టూ కొండలు, తోటలతో కేవలం కాలిబాట మాత్రమే రాళ్ల పాలమ్మ ఆలయానికి ఉండేది. దీంతో ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే భక్తులు గుంపులుగా వచ్చేవారు. 20 ఏళ్ల క్రితం ఇక్కడ ఇటుక బట్టీలు ప్రారంభించిన తమ్మిన కుటుంబ సభ్యులు చుట్టూ కొండను చదునుచేసి తుప్పలను తొలగించారు. దీంతో రాత్రి వేళ కూడా ఈ మార్గంలో నిర్భయంగా రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో గుట్టలుగా ఉన్న రాళ్లను ఇళ్ల నిర్మాణ కోసం పలువురు తీసుకుపోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వాహనాలు కదలకపోవడం, మరమ్మతులకు గురై రోజుల తరబడి నిలిచిపోవడం జరిగింది.