
భౌగోళిక, రాజకీయపరంగానే కాకుండా సాంస్కృతికంగా, చరిత్ర పరంగా భారత్- ఇండోనేసియాల మధ్య వేల ఏళ్ల బంధం ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సంప్రదాయం రెండు దేశాల్లోనూ ఉందని గుర్తుచేశారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో శ్రీ సనాతన ధర్మ ఆలయంలో నిర్వహించిన మహా కుంభాభి షేక కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. “మురుగన్ ఆలయంలో కుంభాభిషేకంలో భాగస్వామిని కావడం ఎంతో ఆనం దంగా ఉంది. నేను మీకెంతో దూరంగా ఉన్నా, నా మనసు మాత్రం జకార్తాకు చేరువగా ఉంది. భారత్-ఇండోనేసియా ఎంత సన్నిహితమో అంత సమీపంగా ఉంది. కొద్దిరోజుల క్రితం మీ అధ్యక్షుడు ప్రబోవో సుబి యాంతో 140 కోట్ల మంది భారతీయుల ప్రేమాభిమా నాలను తీసుకువెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉన్న సుబ్రమణ్యస్వామి భక్తులకు నా అభినందనలు. స్కంద షష్ఠి కవచం మంత్రాలు మనందరికీ రక్షణ కల్పిస్తాయని ఆశిస్తున్న” అని మోదీ చెప్పారు.
ఎన్నో సారూప్యతలు
“వేల సంవత్సరాల సంస్కృతి- సంప్రదాయాలతో మన రెండు దేశాలూ అనుసంధానమై ఉన్నాయి. భారత్ నుంచి ఇండోనేసియా వెళ్లిన వ్యక్తి ప్రంబనన్ ఆలయంలో చేతులు జోడించి మొక్కేటప్పుడు కాశీలోనో, కేదార్నాథోనో ఉన్న భావనే కలుగుతుంది. కకావిన్, శెరాత్ రామాయణాల గురించి భారతీయులు విన్నప్పుడు వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, రామ్ చరితా మానస్ విన్నట్లే ఉంటుంది. ఇండోనేసియా రామ్జీలాను అయోధ్యలోనూ ప్రదర్శిస్తున్నారు. బాలిలో ఓం స్వస్తి-అస్తు అని వినగానే భారత్ లో వేద స్వస్తి గుర్తుకువస్తుంది” అని మోదీ చెప్పారు.





