News

బడ్జెట్‌ సమావేశాల్లోనే ‘వక్ఫ్‌ బిల్లు’.. అఖిలపక్షానికి జాబితా ఇచ్చిన కేంద్రం

225views

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్‌ సవరణ బిల్లు కూడా ఉంది.

బడ్జెట్‌ సమావేశాల్లోనే వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతోపాటు మొత్తం 16 బిల్లులను సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఆ జాబితాను అఖిలపక్షం ముందు ఉంచింది. వక్ఫ్‌ చట్ట సవరణపై గతంలో కేంద్రం జేపీసీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

‘వక్ఫ్‌ బిల్లు’పై స్పీకర్‌కు నివేదిక
వక్ఫ్‌ చట్టంలో మార్పుల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ జెపిసి ఇటీవల సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి.. తాజాగా లోక్‌సభ స్పీకర్‌కు అందించింది.

వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే, ఈ సవరణలపై విపక్షాలు అసమ్మతి తెలిపాయి. ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులపై దాడికే ఈ బిల్లును తెచ్చారని, వక్ఫ్‌బోర్డుల పనితీరులో జోక్యం చేసుకోవడమే ప్రభుత్వం అసలు ఉద్దేశమని విపక్ష సభ్యులు ఆరోపించాయి.