News

పశువుల వ్యాన్‌లను అడ్డుకున్నారని మహిళలపై పశువధ శాల సిబ్బంది దాడి

252views

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలోని లాహం ఫుడ్స్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వహిస్తున్న పశువధ శాల ప్రాంతం ఉద్రిక్తతగా మారింది. ఫ్యాక్టరీకి గేదెలతో వచ్చిన ఐదు వ్యాన్‌లను స్థానికులు అడ్డుకున్న సమయంలో ఫ్యాక్టరీ సిబ్బంది, గేదెల వ్యాన్‌లతో వచ్చిన వారు దాడికి పాల్పడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేసి మరీ కొట్టారని స్థానికులు వాపోతున్నారు. ఫ్యాక్టరీ వద్దకు రాత్రి సమయంలో వ్యాన్‌లను అధిక సంఖ్యలో తరలిస్తుండటంగా గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు అడ్డుకున్నారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం 30 మంది కిరాయి మనుషులను పెట్టుకుని దాడులకు దిగిందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. రెండు వ్యాన్‌లు తప్పించుకుని ఫ్యాక్టరీ లోపలకు వెళ్లగా, ఏడు గేదెలు ఉన్న మూడు వ్యాన్‌లను గ్రామస్తులు అడ్డుకుని పోలీసుల సాయంతో గోశాలకు తరలించారు.

ఇక్కడకు చేరిన పోలీసుల సమక్షంలోనే ఫ్యాక్టరీ తరపున కిరాయికి వచ్చిన వారు మహిళలను బెదిరిస్తూ ఇక నుంచి వ్యాన్‌లను అడ్డుకుంటే ఊరుకోబోమని, ఇష్టానుసారం కొడతామంటూ హెచ్చరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ సిబ్బంది దాడి చేశారని తెలిసి గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరారు. ఎస్సై చంద్రశేఖర్‌ సైతం ఫ్యాక్టరీ యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడారని వ్యాన్‌లను అడ్డుకోవడానికి మీరెవరని, మీపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యానికి మద్దతుగా నిలుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తుండటంతో బాధితులు ముక్కులు మూసుకుని ఉండాల్సి వచ్చింది. దాడి ఘటనపై బాధితులు తణుకు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.