News

వైభవంగా సిరిమాను సంబరం

263views

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ అమ్మవారికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి సంధ్యారాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వివి సూర్యనారాయణ, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి పట్టు వస్త్రాలు అందించి, ఆలయ సంప్రదాయంతో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించాలని ఆకాక్షించారు.గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర గిరిజన పండుగగా గుర్తింపు పొందిన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి సిరిమాను సంబరం మంగళవారం ఘనంగా జరిగింది. జాతర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. శంబర పుర వీధుల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారి సిరిమానును దర్శించుకున్నారు. ఆరోగ్య శాఖ జాతరకు వచ్చే భక్తులకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. కాగా బుధవారం అనుపోత్సవ కార్యక్రమం జరగనుంది. అనంతరం తొమ్మిది మంగళ వారాలు పాటు మారు జాతర నిర్వహిస్తారు.