News

చర్చిలు, మసీదులపై లేని నియంత్రణ దేవాలయాలపైనే ఎందుకో? అలోక్ కుమార్

249views

చర్చిలు, మసీదులపై ప్రభుత్వం కంట్రోల్ లేనప్పుడు కేవలం హిందూ మందిరాలపైనే ఎందుకు నియంత్రణ వుంచుతోందని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ సూటిగా ప్రశ్నించారు.కాశీ, మథుర మందిరాల పునరుద్ధరణ కేవలం తమ లక్ష్యం కాదని, అదో అచంచలమైన విశ్వాసంతో కూడిన నిర్ణయంగా అభివర్ణించారు.విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంతో సాధు సంతుల సమ్మేళనం జరిగింది. దేశ వ్యాప్తంగా వున్న సాధు సంతులు హాజరయ్యారు. మందిరాలపై ప్రభుత్వాల నియంత్రణ, క్షీణిస్తున్న హిందూ జనాభా, సాంస్కృతిక పరిరక్షణ, హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై చర్చ జరిగింది. ఇందులో అలోక్ కుమార్ మాట్లాడుతూ అయోధ్య, మథుర, కాశీ నుంచి అవమానకర చిహ్నాలను తొలగించాలని సాధువులు 1984 లో జరిగిన ధర్మ సన్సద్ సందర్భంగా డిమాండ్ చేశారని గుర్తు చేశారు.

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠ జరిగిందని, ఇప్పుడు కాశీ, మథురకు సమయం ఆసన్నమైందని ప్రకటించారు.కేవలం హిందూ దేవాలయాలపైనే ప్రభుత్వాలన్నీ ఆంక్షలు పెడుతున్నాయని, తమ కన్నుసన్నల్లో వుంచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చు ఈస్టిండియా కంపెనీల తరహాలో వ్యవహరిస్తున్నాయని, మందిరాల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలకు బదిలీ అవుతున్నాయని విమర్శించారు. చర్చి, మసీదులు స్వతంత్రంగా వుండగా… హిందూ మందిరాలపైనే ప్రభుత్వం నియంత్రణలో వుంచుకుంటోందన్నారు. ఇది పూర్తి వివక్షతతో కూడిన విధానమని మండిపడ్డారు. తమ ఆలయాలను తామే నడిపించుకునే సత్తా హిందూ సమాజానికి వుందని పునరుద్ఘాటించారు.

ప్రభుత్వాల చేతుల్లోంచి హిందూ దేవాలయాలు విముక్తం కావాలని ఇప్పటికే తాము ఉద్యమాన్ని ప్రారంభించామని అలోక్ కుమార్ అన్నారు. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా ఉద్యమం ప్రారంభమైందని, లక్షలాది మంది హిందువులు తరలివచ్చి తమకు మద్దతుగా నిలిచారని అన్నారు. హిందూ సమాజం చేతుల్లోకే దేవాలయాలు వచ్చే సమయం ఆసన్నమైందని, దీనిని సాధించే వరకూ తాము ఉద్యమిస్తూనే వుంటామన్నారు.