
బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందన్నారు. యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు.ఈ మేరకు సీఎం ధామి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుంది. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తాం’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
యూసీసీలోని కీలక అంశాలు!
• వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది.
• మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్‌లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది.
• సహ జీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. సహ జీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
• సైనికులు, వాయుసేనలో పని చేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా, సులభంగా తయారు చేయించవచ్చు.
• అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది.
• అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు.
• హలాల్ విధానంపై నిషేధం విధించారు.
ముసాయిదా బిల్లు నుంచి రాష్ట్రపతి ఆమోదం దాకా
యూసీసీ ముసాయిదా రూపకల్పనకు ఉత్తరాఖండ్ సర్కారు పెద్ద కసరత్తు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని 2022 మే 27న నియమించింది. అది ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి సమగ్రమైన యూసీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. 2024 ఫిబ్రవరి 2న యూసీసీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది. ఈ బిల్లును 2024 ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదించింది. నెలరోజుల తర్వాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం లభించింది. తదుపరిగా యూసీసీ బిల్లు అమలుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు మాజీ సీఎస్ శత్రుఘ్నసింగ్ సారథ్యంలో నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ 2024 చివర్లో రాష్ట్ర సర్కారుకు నివేదికను సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ కేబినెట్ యూసీసీ అమలుకు తేదీని నిర్ణయించే అధికారాన్ని సీఎం ధామికి అప్పగిస్తూ తీర్మానం చేసింది.





