
నారాయణ గురు సనాతన ధర్మ వాది కాదంటూ అవాకులు చెవాకులు పేల్చిన కేరళ సీఎం పినరయ్ విజయన్ కి స్వామి సచ్చిదానంద కౌంటర్ ఇచ్చారు. నారాయణ గురు పక్కా సనాతన వాది అని శివగిరి శ్రీనారాయణ ధర్మ సంఘం అధ్యక్షులు స్వామి సచ్చిదానంద స్పష్టం చేశారు. నారాయణ గురు తత్వం, సనాతన ధర్మం అభిన్నమని, రెండూ ఒక్కటేనని ప్రకటించారు. సనాతన ధర్మం విశ్వవ్యాప్తమైందని, శ్రీ నారాయణ తత్వం దాని భౌతిక స్వరూపమని వివరించారు. ఈ విషయాన్ని నారాయణ గురు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారని తెలిపారు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న తత్వం సనాతన ధర్మానికే చిహ్నమని తెలిపారు. ఇదే విషయంపై నారాయణ గురు 1927 లో అలప్పుజా జిల్లా పల్లతురుతిలో చేసిన ప్రసంగాన్ని స్వామి సచ్చిదానంద ఉటంకించారు.
సనాతన ధర్మం సార్వత్రికమని, ఒక్క హిందువులకే వర్తించదన్నారు.మత మార్పిడి కోరుకునే వారు సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని నారాయణ గురు సూచించేవారని గుర్తు చేశారు. సనాతన ధర్మానికీ, చాతుర్వర్ణానికి సంబంధం లేదన్నారు.అంటరానితనాన్ని నిర్మూలించడానికి నారాయణ గురు, దయానంద సరస్వతీ, వివేకానంద తదితరులు చాలా ప్రయత్నాలు చేశారన్నారు.
మనిషి మతానికి అతీతుడని, విశ్వాసాలతో సంబంధం లేకుండా వుండేందుకు కృషి చేయాలని గురుదేవులు సూచించేవారన్నారు. సనాతన ధర్మంలో కూడా కొన్ని ఇబ్బందులు వున్నాయని, వీటిని అధిగమించాలన్నారు. మతం అన్నది రాకముందే సనాతన ధర్మం ఉనికిలో వుందని స్వామీజీ అన్నారు.
కేరళ సీఎం చేసిన వ్యాఖ్యలివీ…
నారాయణ గురు సనాతన ధర్మ వాది కాదని కేరళ సీఎం పినయర్ అన్నారు. నారాయణ గురు వారసత్వంగా వచ్చిన వృత్తులను ధిక్కరించాల్సిందేనని పిలుపునిచ్చారన్నారు. అలాంటప్పుడు నారాయణ గురు సనాతన ధర్మ వాది ఎలా అవుతారంటూ వితండ వాదానికి దిగారు.
ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని ప్రచారం చేసిన నారాయణ గురు సనాతన ప్రతిపాదకుడు ఎలా అవుతారని అన్నారు.కుల వ్యవస్థలున్న కాలం నాటి సాంస్కృతిక నేపథ్యం వున్న మహాభారతం ధర్మానికి సంబంధించిన కచ్చితమైన సమాధానం చెప్పకుండా అనేక సందేహాస్పద ప్రశ్నలను లేవెనెత్తే విధంగా వుందంటూ వ్యాఖ్యానించారు.నారాయణ గురు సనాతన ధర్మ వాదే అని చూపడానికి చాలా వ్యవస్థీకృత ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.ఆయన సనాతన ధర్మ వాది కాదని, అవన్నీ కూల్చేసి, ఆధునిక కాలానికి సరిపోయే కొత్తయుగ ధర్మాన్ని బోధించిన గొప్ప జ్ఞాని అంటూ కొత్త భాష్యానికి తెరలేపారు సీఎం విజయన్.





